iDreamPost
iDreamPost
లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాక నిర్మాతలు ఏ స్థాయిలో పోటీ పడి మరీ విడుదలలు ప్లాన్ చేస్తున్నారో చూస్తున్నాం. హిట్టు ఫట్టు పక్కన బెడితే గత రెండు మూడు శుక్రవారాలు ఒక్క టాలీవుడ్ లోనే ఒకేరోజు కనీసం అయిదు నుంచి పది మధ్యలో సినిమాలు రిలీజయ్యాయి. ఓపెనింగ్స్ వస్తాయా రావా రెవిన్యూ ఏమవుతుందనే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు విడుదల చేసేసి ఆపై వారంలోనే వాటిని ఓటిటికి ఇచ్చేస్తున్న వైనం అటు బయ్యర్లకు ఇటు ప్రేక్షకులకు షాకింగ్ గా ఉంది. అయితే పెద్ద చిత్రాల విషయంలో మాత్రం మాటకు కట్టుబడి ఉండటం చాలా కష్టంగా మారుతోంది. మార్పులు తప్పడం లేదు.
కార్తీ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న సుల్తాన్ మీద మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టీజర్ వచ్చాక తెలుగులోనూ క్రేజ్ పెరిగింది. ఖైదీ ఫలితం తాలూకు ఇంపాక్ట్ చాలా పాజిటివ్ గా ఉంది. ఏప్రిల్ 2 విడుదలని గతంలో ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా వేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉంది. జనాలు పెద్దగా సినిమాలు చూసే మూడ్ లో లేరు. ఎక్కడ చూసినా ఎలక్షన్లకు సంబందించిన చర్చలతోనే పబ్లిక్ తో పాటు మీడియా తలమునకలై ఉంది. అందుకే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెన్నై న్యూస్.
ఇదే జరిగితే ఏప్రిల్ 2కి షెడ్యూల్ చేసుకున్న నాగార్జున వైల్డ్ డాగ్, గోపీచంద్ సీటిమార్ కు చాలా ప్లస్ అవుతుంది. వీటికి థియేటర్ల కౌంట్ పెరుగుతుంది. అంతే కాదు వీటి కంటే సుల్తాన్ లో మసాలా కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా ఓపెనింగ్స్ ని పంచుకోవాల్సి వస్తుందేమో అనే టెన్షన్ అభిమానుల్లో ఉండింది. ఇప్పుడు సుల్తాన్ కనక వెనక్కు తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. గమనిస్తే ఇప్పటిదాకా ఈ సినిమా తాలూకు ప్రమోషన్లు పెద్దగా చేయడం లేదు. ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. యూనిట్ పబ్లిసిటీ వైపు దృష్టి పెట్టడం లేదు. సో ఇదంతా చూస్తే వాయిదా తప్పదనే సంకేతాలుగానే కనిపిస్తోంది