iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీ నేత, కేంద్ర మాజీ సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరి వ్యవహారం రాష్ట్ర, కేంద్ర అధికార పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. తాజాగా సుజనా చౌదరి జెరూసలేం, హజ్ యాత్రల సబ్సిడీ, సామాజిక వర్గాల కార్పొరేషన్లు తదితర అంశాలపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్మించారు. ప్రభుత్వ విధానాలను, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని విమర్మించడంతోపాటు ఏకంగా పార్టీ కార్యకర్తలకే పంచాయతీ కొలువులు కట్టబెట్టారని నిర్దారించేశారు. ఇప్పటికే సుజనా వ్యవహార శైలిపై సొంత పార్టీ బీజేపీతో పాటు రాజకీయ ప్రియుల్లో అనేక అనుమానాలు ఉండగా…తాజాగా ఆయన టీడీపీ పల్లవినే వినిపించే సరికి అసలు రంగు బయటపడినట్లయింది.
ఇప్పటి వరకు బీజేపీ పట్ల ఒకింత వేచిచూసే ధోరణిని అవలంభించిన వైఎస్సార్‌సీపీ సుజనా వ్యవహారంతో ఒక్కసారిగా అలెర్టయింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సుజనాపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.‘ఎంపీ సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు’ అని అర్థమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారంటూ సుజనా చేసిన వ్యాఖ్యలపై విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ , ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో… బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురుంచి ప్రెస్‌మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు. ‘ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకులకు చెందిన అధికారులను ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే… ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఆయనను ఎందుకు పార్టీ మార్చాడో అన్నీ అర్ధమవుతాయి’ అని చురకలు అంటించారు.
సుజనాతోపాటు ఎల్లో మీడియా తీరుపైనా విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు… సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు ప్రెస్ మీట్‌ను లైవ్ స్ట్రీమింగ్‌తో మోతెక్కించిందంటే… కారణం పబ్లిక్ ఇంట్రెస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?’ అని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తాజా విమర్శలు చూస్తుంటే రెండు పార్టీల మధ్య సుజాన చౌదరి పెట్టిన చిచ్చు బాగానే అంటుకున్నట్టు కనిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ, బీజేపీలు ఏవిధంగా ముందుకెళ్తాయో..!