సుడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది దుర్మరణం చెందగా, మరో 130 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు.
సుడాన్ దేశ రాజధాని ఖార్తూమ్ లో గల బహ్రి ఏరియాలో ఉన్న సలూమి సిరామిక్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. గ్యాస్ టాంకర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు. సంఘటన జరిగే సమయానికి ప్రమాదం ఘటనకి సమీపంలో 53 మంది భారతీయులు పని చేస్తున్నారని,ప్రమాద తీవ్రతకి వారిలో 18 మంది చనిపోయారని, మరో ఏడుగురు భారతీయులు గాయపడ్డారని భారతీయ రాయబార కార్యాలయం వెల్లడించింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపింది.
సలూమి సిరామిక్ ఫ్యాక్టరీలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని,సహాయక సామగ్రి కూడా పూర్తి స్థాయిలో లేవని తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాల అన్వేషణకు,భవిష్యత్తులో మరో ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం సుడాన్ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. సూడాన్ ప్రధానమంత్రి అబ్దుల్లా హాండక్ మృతులకు తన సంతాపాన్ని తెలియజేసారు. గ్యాస్ టాంకర్ పేలడానికి గల కారణాల గురించి విచారణ కొనసాగుతోంది.