iDreamPost
android-app
ios-app

చట్టం ముందు అందరూ సమానులే.. నిరూపించిన జగన్‌ సర్కార్‌..

చట్టం ముందు అందరూ సమానులే.. నిరూపించిన జగన్‌ సర్కార్‌..

చట్టం పెద్దలకు చుట్టం అనేది నాటి మాట.. చట్టం ముందు అందరూ సమానమే అనేది ఆంధ్రప్రదేశ్‌లో నేటి మాటగా మారుతోంది. తప్పు చేసిన వ్యక్తి రాజకీయ నాయకుడైనా, ప్రభుత్వ అధికారి అయినా చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే. అందుకు శిక్ష పడాల్సిందే. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో దళిత యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి శిరోముండనం చేయించిన కేసులో స్టేషన్‌ ఇంచార్జి ఎస్‌ఐపై కేసు నమోదు అయింది. కేసు నమోదు చేయడంతోనే కాదు ఆతన్ని సస్పెండ్‌ చేశారు. కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. తప్పు చేసింది ఎస్‌ఐ అయినా సరే ఈ కేసులో ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎక్కడా తన బాధ్యతలను మరచిపోలేదు. అరెస్ట్‌ చేయించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని జగన్‌ సర్కార్‌ నిరూపించింది.

ఘటన జరిగిన వెంటనే స్పందించిన సీఎం జగన్‌ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాటలు చెప్పడమే కాదు.. జగన్‌ వాటిని ఆచరణలో చూపించారని దళిత సంఘాల నేతలు కొనియాడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత స్వల్ప వ్యవధిలోనూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలకు ఏమీ మిగలడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తహసీల్దార్, మండల మేజిస్ట్రేట్‌ అయిన వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే, నేతలు జట్టు పట్టుకుని ఈడ్చి కొట్టినా.. చర్యలు తీసుకోని నాటి రోజులకు.. తాజాగా వైసీపీ ప్రభుత్వ పనితీరును పోల్చుతున్న ప్రజలు పాలకులు వ్యవహరిస్తున్న విధానంపై చర్చించుకుంటున్నారు.

ఇరువురి మధ్య జరిగిన వివాదంలో వచ్చిన ఫిర్యాదుపై అత్యుత్సాహం ప్రదర్శించిన సీతానగరం ఇంచార్జి ఎస్‌ఐ ఫిరోజ్‌.. దళిత యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. చట్ట ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌ఐ.. విచక్షణ మరచి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. దళిత యువకుడిని స్టేషన్‌లో చితకబాదిన ఎస్‌ఐ.. అంతటితో ఆగకుండా అతనికి శిరోముండనం చేయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.