ఆల వైకుంఠపురములోతో నాన్ బహుబలి రికార్డులు సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప బిజినెస్ సర్కిల్స్ లో హాట్ కేక్ గా మారింది. ఆగస్ట్ 13న విడుదల తేదీ ప్రకటించేయడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా జిక్యూ ఇండియా ప్రకటించిన టాప్ 25 ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ నుంచి తెలుగు హీరోలలో ఒక్క బన్నీకి మాత్రమే చోటు దక్కడం అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ప్రభావితం చేయగలిగిన ప్రముఖుల్లో చోటు దక్కడం అంటే విశేషమే. కేరళలోనూ విశేషమైన ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ మీద కూడా కన్నేశాడు.
ఇక ఆ టాప్ 25లో ఉన్న ఇతర సెలబ్రిటీల లిస్టు చూస్తే అనుష్క శర్మ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, డానిష్ సేథ్, వరుణ్ దేశ్ పాండే, జెహాన్ దారువాలా, ప్రణవ్ పాయ్ సిద్దార్థ్ పాయ్, నందిని వెల్హో, మినమ్ అపాంగ్, లీజా మంగళదాస్, స్వప్నిల్ జైన్, బాల సర్దా, అపరాజిత నినన్, చైతన్య తమ్హానే, కృషి ఫగ్వానే, అంబి బిందు సుబ్రహ్మణ్యం, అభిషేక్ ముంజల్ తదితరులు ఉన్నారు. సౌత్ నుంచి సినిమా ప్రముఖులలో ఒక్క అల్లు అర్జున్ పేరు మాత్రమే ఉండటం గమనార్హం. వివిధ రంగాలకు చెందిన వాళ్ళను కొన్ని పారామీటర్స్, సర్వేల ఆధారంగా జిక్యూ సంస్థ వీటి ఎంపికను చేపడుతుంది. సో ఇది ఘనత కిందే తీసుకోవాలి.
బన్నీ ప్రస్తుతం పుష్ప పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే మారేడుమిల్లిలో భారీషెడ్యూల్ పూర్తి చేశాక కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏకధాటిగా కొనసాగబోతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్పలో ముందు అనుకున్న విజయ్ సేతుపతి స్థానంలో కన్నడ నటుడు ధనుంజయ్ తో పాటు సునీల్ విలన్లుగా నటిస్తున్నారు. ఇదయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మరో భారీ ప్రాజెక్టు వెంటనే మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరితో చేస్తారనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. కొందరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా కంక్లూజన్ రాలేదు.