హుజురాబాద్ బై పోల్ లో రాజకీయపార్టీల ఎత్తుగడలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ బై పోల్ ను అడ్డుపెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతో పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉపఎన్నిక ఫలితం ఆధారంగానే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందనేది వారి అంచనాగా ఉంది. యువత మెప్పు పొంది తమబలాన్ని పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలు… అభ్యర్థుల ప్రకటన నుంచి ఎన్నికల వాగ్దానాల వరకు వారికే ప్రాధాన్యమిస్తున్నాయి.
పోటీలో విద్యార్థి సంఘ నేతలు..
హుజురాబాద్ ఉప ఎన్నిక లో TRS, కాంగ్రెస్ పార్టీలకు సబంధించిన ఆయా పార్టీల స్టూడెంట్ వింగ్ చీఫ్ లు పోటీకి దిగుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నేత బల్మూరి వెంకట్ కూడా ఉప ఎన్నిక బరిలో నిలిచారు. విద్యార్థి పోరాటాలతో ప్రత్యక్ష సంబంధమున్న ఈ ఇరువురు నేతలు హుజురాబాద్ వేదికగా జరిగే బ్యాలెట్ పరీక్షలో పోటీపడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. వెలమ సామాజికవర్గానికి చెందని బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు, NSUI తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. . టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రస్తుతం TRSV చీఫ్ గా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున పోటీకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి కూడా వామపక్ష అనుబంధ సంఘాలు చేపట్టిన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవముంది.
నిరుద్యోగ సమస్య..
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పెద్ద ఎత్తున జరగలేదు. దీంతో చాలా మంది యువత నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ పై నమ్మకంతో ఇప్పటి వరకు ఎదురు చూశారు. కానీ రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో అధికారపార్టీపై యువత ఆగ్రహంగా ఉంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. త్వరలో ఉద్యోగ నియామకాలే చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటనలు కూడా చేసింది.
Also Read : టీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ సై అంటే సై..!
కాంగ్రెస్ ప్లాన్..
అధికార పార్టీ పై ఉన్న ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, మరికొన్ని పార్టీలతో కలిసి ఆందోళనలు చేపట్టింది. ఆ విధంగా యువతకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే స్టూడెంట్ లీడర్ అయిన వెంకట్ ను హుజురాబాద్ సంగ్రామంలో తమ ప్రతినిధిగా నిలిపింది. యువత భవిష్యత్ కోసం పోరాడుతున్న తమను ఆదరించాలని ఓటర్లను అభ్యర్థించేందుకు మంచి అవకాశం దొరికింది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కాంగ్రెస్ తన ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. విద్యార్థి నేతలను సంఘటితం చేసి వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వంపై అసంతృప్తి గా ఉన్న వర్గాలను ఐక్యం చేస్తే అంతిమంగా తమకే పవర్ దక్కుతుందనేది కాంగ్రెస్ వ్యూహంగా అర్ధమవుతోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ తన యాక్షన్ ప్లాన్ ను అమలు చేసింది. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన నేతనే కాంగ్రెస్ పోటీకి దింపడం సాహసోపేత నిర్ణయం. అభ్యర్థికి ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ పరమైన పరిచయాలు కలిసివచ్చే అంశం.
ఎవరి బలమెంత..?
హుజురాబాద్ లో ఎస్సీ, ముదిరాజ్, గౌడ, పద్మశాలి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారు. అలాగే ఆయన భార్య సామాజికవర్గం రెడ్డి కావడంతో ఆ వర్గం నుంచి మద్దతు ఉంటుందనేది ఈటల నమ్మకం. ఇక దళితబంధు పథకంతో ఆ వర్గం ఓటర్లు అంతా తమ వైపు ఉంటారని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక గౌడ కులస్తుల కోసం కూడా ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. పద్మశాలి ఓట్ల కోసం సీనియర్ నేత ఎల్ రమణను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఆయా వర్గాల నుంచి తమకు మద్దతు దక్కుతుందనే ఆలోచనలో అధికారపార్టీ ఉంది.
ఆయా పార్టీలు భావిస్తున్నట్లు ఏ పార్టీకి యువత ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకును బీజేపీ, కాంగ్రెస్ చీల్చుకుంటే అంతిమంగా అధికార పార్టీకి మేలు జరిగే అవకాశముంది. అయితే ఈ ఈక్వేషన్ బై పోల్స్ కు వర్తించకపోవచ్చు.
Also Read : హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు