Idream media
Idream media
కరోనా సంక్షోభం పూర్తిగా సమసిపోకుండానే ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాలలో జరుగుతున్న మూడు మ్యాచుల సిరీస్ మెదటి మ్యాచ్ గెలిచి అభిమానుల్లో ఆశలు రేపిన వెస్టిండీస్ జట్టు ఆ తరువాతి రెండు మ్యాచుల్లో పేలవమైన ప్రదర్శన చూపించి సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ చివరి ఇన్నింగ్స్ లో తన కెరీర్ లో 500 వికెట్లు తీసిన ఏడవ బౌలర్గా రికార్డు పుస్తకాలలో స్థానం సంపాదించాడు ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్.
T20 2007 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు కొట్టటం అందరికి గుర్తుంటుంది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లోనే యువరాజ్ ఆరు సిక్స్ లు కోట్టింది! స్టువర్ట్ బ్రాడ్ మొదటి నుంచి మంచి బౌలర్, కానీ ఆ మ్యాచ్ లో ప్లింటాఫ్ యువరాజ్ తో గొడవపడి రెచ్చకొట్టాడు… ఆ కోపానికి స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడు.
హాడ్లీ – కపిల్ రికార్డు
1877లో మొట్టమొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 113 సంవత్సరాలకు నాలుగొందల టెస్టు వికెట్లు సాధించిన తొలి బౌలరుగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రిచర్డ్ హాడ్లీ రికార్డు స్థాపించాడు. ఆ సంవత్సరమే 431 వికెట్లు వద్ద తన కెరీర్ ముగించాడు హాడ్లీ. అతని సమకాలీనులు, అతనితో సమానమైన ప్రతిభావంతులుగా చెప్పబడే ఆల్ రౌండర్లు కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్ లలో కపిల్ దేవ్ ఒక్కడే ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉందనిపించింది. సుదీర్ఘ కాలం ఫాస్ట్ బౌలర్ గా సేవలందించడం వల్ల శరీరం సహకరించకపోయినా, బౌలింగులో మునుపటి పదును లేకపోయినా ఈ రికార్డు కోసమే కపిల్ తన రిటైర్మెంట్ వాయిదా వేసుకున్నాడు.
చివరకు 1994లో హాడ్లీ రికార్డును అధిగమించి, 434 వికెట్లతో తన కెరీర్ ముగించాడు కపిల్. కపిల్ తో తనూ సమానం అని క్రికెట్ అభిమానులు భావించినా తను ఆ రికార్డు సాధించలేకపోయానన్న అసూయతో ఇమ్రాన్ ఖాన్, హాడ్లీకి క్రికెట్ మైదానంలోకి తిరిగి అడుగు పెట్టి, కపిల్ రికార్డుని అధిగమించి అప్పుడు రిటైర్ అవమని సలహా ఇచ్చాడు. ఇదెంత హాస్యాస్పదం అంటే హాడ్లీ ఈ అప్పీలు అసలు పట్టించుకోలేదు. వన్డే క్రికెట్ అభిమానులను బాగా అకట్టుకోవడంతో కపిల్ నెలకొల్పిన 434 వికెట్ల రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా అని క్రికెట్ అభిమానులు అనుకున్నారు.
వార్న్-మురళీధరన్-కుంబ్లే
టెస్టు క్రికెట్ పట్ల అభిమానుల్లో ఆసక్తి తగ్గుతున్న రోజుల్లో మణికట్టుతో మాయాజాలం చేసే ముగ్గురు స్పిన్ బౌలర్లు ఆటలో ఆరంగేట్రం చేశారు- ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్, భారత బౌలర్ అనిల్ కుంబ్లే, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. వీరితో పాటుగా ఇదే కాలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ కూడా మైదానంలో దిగారు. ఈ అయుదు మంది బౌలర్లు ఎడాపెడా వికెట్లు తీయడంతో అయిదు వందల వికెట్ల మైలురాయిని అవలీలగా దాటేశారు.
ఫాస్ట్ బౌలింగ్ వల్ల కాళ్ళు, వెన్నెముక జాయింట్ల మీద అధిక భారం పడుతుంది కాబట్టి ఎక్కువ రోజులు కెరీర్ కొనసాగించలేరు కాబట్టి స్పిన్నర్లలోనే ఎవరో ఒకరు అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు నెలకొల్పుతారని అభిమానులు అంచనా వేశారు. కొంచెం అటూఇటూగా ఒకే సమయంలో రిటైరన ఈ బౌలర్లలో 133 మ్యాచులలో 800 వికెట్లు తీసి మురళీధరన్ మొదటి స్థానంలో, 145 మ్యాచుల్లో 708 వికెట్లతో షేన్ వార్న్ రెండవ స్థానంలో, 132 మ్యాచుల్లో 619 వికెట్లతో మూడో స్థానంలో కెరీర్ ముగించారు.
ప్రస్తుత ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 589 వికెట్లు, గ్లెన్ మెక్ గ్రాత్ 563 వికెట్లు, కోర్ట్నీ వాల్ష్ 519 వికెట్లు తీసి 500 టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు అయ్యారు. ఇప్పుడు 140 మ్యాచుల్లో 501 వికెట్లు తీసి స్టూవర్ట్ బ్రాడ్ 500 వికెట్ల క్లబ్బులో చేరిన ఏడవ బౌలర్ అయ్యాడు. ఆండర్సన్ కానీ, బ్రాడ్ కానీ మరికొంత కాలం ఆడే అవకాశం ఉన్నందున ఇద్దరికీ ఆరు వందల వికెట్ల క్లబ్బులో చేరే అవకాశం పుష్కలంగా ఉంది.