iDreamPost
android-app
ios-app

చిరు వ్యాపారులకు తప్పిన డైలీ ఫైనాన్స్ కష్టాలు

  • Published Sep 22, 2021 | 7:11 AM Updated Updated Sep 22, 2021 | 7:11 AM
చిరు వ్యాపారులకు తప్పిన డైలీ ఫైనాన్స్ కష్టాలు

నిరంతరం ఒడిదుడుకులతో బతుకుబండి లాగే చిరు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోంది. వ్యాపారులు రోజువారీ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా, వారి ఆగడాలకు గురికాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ లో జగనన్న తోడు పేరుతో ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఏటా రూ. పది వేల రుణం అందేలా చేస్తారు. ఇందుకు అయ్యే పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

ఇలాంటి వారందరికీ..

రోడ్డు పక్క ఇడ్లీ బండి, తోపుడు బండిపై కూరగాయల అమ్మకం, మిర్చి బజ్జీల దుకాణం, ఇంటి వద్దే చిన్న కిరాణా కొట్టు ఇలా చిన్నపాటి వ్యాపారం చేసుకొనేవారికి వడ్డీ లేని రుణాలు అందేలా చేస్తోంది. వీరితోపాటు హస్తకళాకారులు, సంప్రదాయ చేతి వృత్తులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మలు, ఇతర సామగ్రి తయారీదారులు, లేస్ వర్క్, కుమ్మరి. కమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.

Also Read : ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?

పారదర్శకంగా ఎంపిక..

ఈ పథకం లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. వడ్డీ లేని రుణానికి దరఖాస్తును గ్రామ/ వార్డు సచివాలయంలో అందజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులపై గ్రామ వలంటీర్లు సర్వే చేసి అర్హుల జాబితా రూపొందిస్తారు. దీన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. బ్యాంకర్లతో సమన్వయం కోసం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు జారీచేస్తారు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి రుణాలు ఇప్పించే వరకు వలంటీర్లు సహకరిస్తారు. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక పోర్టల్ నిర్వహిస్తోంది. ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలియజేసేందుకు 1902 టోల్ నంబరు ఏర్పాటు చేసింది.

చెల్లింపులు ఇలా..

లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణానికి కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తుంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్లీ వడ్డీ లేని రుణం పొందవచ్చు. ఇప్పటి వరకు జగనన్న తోడు పథకం కింద 9,05,458 మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందజేసింది.

కరోనా వేళ కొండంత అండ..

కరోనా దెబ్బకు బతుకు బండి తలకిందులై దిక్కుతోచని చిరు వ్యాపారులకు ఈ పథకం కొండంత అండగా నిలిచింది. కాళ్లు అరిగేలా వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా, అధిక వడ్డీ భారం లేకుండా వారంతా తమ వ్యాపారాలను తిరిగి నిలబెట్టుకునేందుకు దోహదం చేసింది. తమలాంటి వారి కోసం ముందుచూపుతో ఇటువంటి పథకాన్ని ప్రవేశ పెట్టడమే కాక చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వానికి చిరు వ్యాపారులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

Also Read : ఆ రెండు పధకాలు.. యువత భవితకు జోడు చక్రాలు