ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రీట్ లైటుల బాధ్యత ఇకపై ప్రైవేట్ వ్యక్తుల చేతినుండి సచివాలయాలకు బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
గతంలో రాష్ట్రంలో వీధి దీపాల నిర్వహణ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది. దాంతో వీధి దీపాలు పగటి పూట కూడా నిరంతరరాయంగా వెలుగుతూనే ఉండటమో లేక రాత్రిపూట వెలగకుండా ఉండటమో జరిగేవి. ఇప్పుడీ సమస్యలకు పరిష్కారంగా నూతన సర్క్యులర్ జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీధి దీపాల బాధ్యత ఇకపై సచివాలయాలకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది.
వీధి దీపాల సమస్య ఉంటే ప్రజలు స్థానిక గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చు. గ్రామ లేదా వార్డు వాలంటీర్ ద్వారా కూడా కంప్లైంట్ చేయించవచ్చు. గ్రామ సచివాలయ పరిధిలో ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం కొత్తగా నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ సత్వరమే స్పందించి వీధి దీపాల సమస్యను పరిష్కరిస్తాడు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 200 కరెంటు పోల్స్ ఉంటాయని, వాలంటీర్ల సహాయంతో ఎనర్జీ అసిస్టెంట్ వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అధికారులు వెల్లడించారు.