జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించాడు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి ఉదయం 7.45 గంటలకు అజిత్ దోవల్ ఇంట్లోకి కారుతో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది సరైన సమయంలో ఆ వ్యక్తిని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి మానసిక రోగి అని గుర్తించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి కాస్త గుసగుసలాడుతున్నాడు. తన బాడీలో ఎవరో చిప్ పెట్టారని, దాన్ని రిమోట్‌లో కంట్రోల్ చేస్తున్నారని కూడా చెప్పాడు. అయితే, విచారణలో అతడి శరీరం నుంచి ఎలాంటి చిప్ లభ్యం కాలేదు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి కర్ణాటకలోని బెంగళూరు వాసి. అతని పేరు శాంతను రెడ్డి అని తెలుస్తోంది. నోయిడా నుంచి రెడ్ కలర్ ఎస్‌యూవీ కారును అద్దెకు తీసుకుని దోవల్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించాడు అని తెలుస్తోంది. అలా కారులో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు, ఆ సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నారు. ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగానికి అప్పగించారు. ప్రస్తుతం అసలు ఆ వ్యక్తి అక్కడికి రావడం వెనుక ఆంతర్యమేమిటి అనే విషయం తేల్చేందుకు వారు మల్లగుల్లాలు పడుతున్నారు.
Z + కేటగిరీ భద్రత
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు CISF రక్షణ కల్పిస్తుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు Z + కేటగిరీ భద్రత నిరంతరం ఉంటుంది. అంటే ఆయన భద్రత కోసం 58 మంది ఉంటారు. వారిలో 10 మంది ఆర్మ్‌డ్ స్టాటిక్ గార్డ్‌లు, 6 మంది పీఎస్‌ఓలు, 24 మంది జవాన్లు, 5 మంది వాచర్లు రెండు షిఫ్టుల్లో పని చేస్తూ ఉంటారు. భారతదేశ జేమ్స్ బాండ్ అని భద్రతా వర్గాలు పిలుచుకునే అజిత్ దోవల్ పాకిస్తాన్ లో కొన్నాళ్లు అండర్ కవర్ ఆఫీసర్ గా పనిచేసి వచ్చాడని అంటుంటారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లో జన్మించిన అజిత్ దోవల్ కేరళ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 1972లో, ఆయన భారత గూఢచార సంస్థ IBతో పనిచేయడం మొదలుపెట్టారు. ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా మారడం ద్వారా దోవల్ ఎన్నో విజయాలు సాధించారు. గూఢచారిగా సుమారు ఏడేళ్ల పాటు పాకిస్తాన్‌లో కూడా జీవించినట్లు సమాచారం.
ఆ వీడియో దొరకడంతో
‘ఆపరేషన్ బ్లూ స్టార్’, ‘ఆపరేషన్ బ్లూ థండర్’లో కూడా ఆయన పాత్ర ముఖ్యమైనది. 1999లో విమానం హైజాక్ అయినప్పుడు, ప్రభుత్వం తరపున ప్రధాన సంధానకర్తగా నియమించబడ్డాడు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునే ప్రణాళికను రూపొందించే బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ NSA అజిత్ దోవల్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) దాటి బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. నిజానికి దోవల్ అనేక ఉగ్రవాద సంస్థల టార్గెట్ కూడా. గత ఏడాది ఫిబ్రవరిలో జైషే ఉగ్రవాది నుంచి దోవల్ కార్యాలయంలోకి వెళుతున్నట్టు షూట్ చేయబడిన ఒక వీడియో దొరికింది. ఈ వీడియోను ఉగ్రవాది పాకిిస్తాన్ హ్యాండ్లర్‌కు పంపాడని తేలడంతో అప్పటి నుంచి దోవల్ భద్రతను మరింత పెంచారు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో మరింత అలెర్ట్ అవ్వనున్నారు.