iDreamPost
android-app
ios-app

ఇంకెన్నాళ్లు వేచి చూడాలో

  • Published Jul 11, 2020 | 8:56 AM Updated Updated Jul 11, 2020 | 8:56 AM
ఇంకెన్నాళ్లు వేచి చూడాలో

సినిమాను థియేటర్లో చూస్తేనే అనుభూతి చెందే ప్రేక్షకుల ప్రశ్న ఇదే. ఇప్పటిదాకా వీటి గేట్లు తెరవడం గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వాలు సైతం ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటిది నాలుగో నెల. చరిత్రలో ఎప్పుడూ చూడని శూన్యం ఇది. రేపో ఎల్లుండో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న భారీ చిత్రాల నిర్మాతలు ఓటిటి నుంచి ఎంత టెంప్టింగ్ ఆఫర్లు వచ్చినా చలించడం లేదు. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు మాత్రం హక్కులు అమ్మేసుకుని సేఫ్ అయ్యారు. మరోవైపు పోస్టు ప్రొడక్షన్ జరుపుకుంటున్న వాటి నెంబర్ కూడా పెరుగుతూ పోతోంది. మల్టీ ప్లెక్సులు తాము తీసుకోబోయే జాగ్రత్తల గురించి ఎన్ని వీడియోలు విడుదల చేసినా లాభం లేకపోయింది.

దసరా అనే గట్టి నమ్మకం మొన్నటిదాకా ఉండేది. ఇప్పుడదీ సన్నగిల్లుతోంది. ఓనర్లు సిద్ధంగానే ఉన్నా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రానిదే ఏమీ చేయలేరు. శానిటైజేషన్ జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా హౌస్ ఫుల్ కావడమనేది ఇప్పట్లో కలే. సీటు సీటు మధ్య నిబంధనల వల్ల ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉండటంతో బయ్యర్లు సైతం ఇంతకు ముందులా మార్కెట్ ని బట్టి పెట్టుబడుల వర్షం కురిపించలేరు. వసూళ్ళను బట్టి పంచుకుదామనే ప్రతిపాదన రావొచ్చు. ఇప్పటికే దీని తాలుకు చర్చలు పలు సర్కిల్స్ లో జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడులో చూస్తేనేమో నిర్మాతలందరూ కలిసి నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాల్లో కొంత కాలం కోత విధించేలా అధికారిక అమలుకు ప్రయత్నిస్తున్నారు.

థియేటర్లు తెరుచుకున్నాక గతంలో లాగే జనం వస్తున్నారన్న గ్యారెంటీ దొరికినప్పుడు యధావిదిగా పాత పద్ధతికి వెళ్దామనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట.మరి సదరు యాక్టర్స్, సాంకేతిక నిపుణుల అసోసియేషన్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. అక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇదే పోకడ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది ఎన్నడూ చూడని విపత్తు కావడంతో తలలు పండిన పరిశ్రమ పెద్దలు సైతం ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు ఓటిటి, ఏటిటి అంటూ అగ్ర సంస్థలు సైతం వీటి వైపు అడుగులు వేస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పట్లో సినిమా హళ్ళ వైపు అంతగా ఆసక్తి చూపడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఏతావాతా సంక్రాంతి దాకా ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదనేలా ఉన్నాయి పరిణామాలు. ఒకవేళ అదృష్టవశాత్తు ఆగస్ట్ లోనే వ్యాక్సిన్ వచ్చేస్తే టెన్షన్ తీరిపోయి దసరా నుంచే సందడిని ఎంజాయ్ చేయొచ్చు. అదే జరగాలని అందరూ కోరుకుంటున్నారు.