iDreamPost
iDreamPost
ఒక సినిమా పూర్తి అయిన తర్వాత ఇంకో సినిమా చేయడం సినీ హీరోలకు అలవాటు. పధ్ధతి కూడా అదే. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా సినిమాల పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రశ్నిస్తాను.. పోరాడతాను.. అంటున్న ఆయన ఒక సమస్య తర్వాత ఇంకో సమస్యపై ఫోకస్ అంటున్నప్పటికీ.. దేన్నీ చివరివరకు కొనసాగించడం లేదు. ఒకటి రెండు షెడ్యూళ్లకే ప్యాకప్ చెప్పి మరో సమస్యవైపు వెళ్లిపోతున్నారు.
గతంలో అలాగే చేసిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారని ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి పవన్ మద్దతు తెలిపారంటే ఏదో ఒకటి తేల్చేస్తారని ఆశపడితే.. ఆయన రాజకీయాల మాదిరిగానే ఉద్యమాన్ని కూడా పార్ట్ టైంగా మార్చేయడం.. ప్రశ్నించాల్సిన కేంద్రాన్ని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో ఇంతేనా.. పవన్ అని నిట్టూరుస్తున్నారు.
Also Read : High Court – అది ‘ఏపీ ప్రభుత్వ’ నిర్ణయం… హైకోర్టు కీలక తీర్పు!
స్థిరత్వం లేని మాటలు
పార్ట్ టైం పొలిటీషియన్ గా పేరు పొందిన పవన్ కళ్యాణ్ పలు అంశాలపై పోరాటాలంటూ చేస్తున్న హంగామా కూడా అలాగే ఉంది. గతంలో ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై పోరాటం అంటూ కొన్నాళ్లు హడావుడి చేసి వదిలేశారు. తర్వాత రోడ్ల సమస్యలు, శ్రమదానం అంటూ ఫోజులిచ్చారు. అదీ అయిపోయింది. ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు పేరుతో గత నెలలో స్టీల్ ప్లాంట్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు. తర్వాత నెలరోజులు పట్టించుకోకుండా మళ్లీ ఈ నెల 12న 10 టు 5 దీక్ష చేశారు. ఇప్పటికింతే అన్నట్లు చాలించేశారు. ఇప్పుడేమో రాయలసీమ రైతుల సమస్యలపై ఫోకస్ చేస్తామంటున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ పోరాటం సంగతి అంతేనా అని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్నించాల్సిన వారిని వదిలి..
వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అది ప్రారంభమైన పది నెలల తర్వాత పవన్ మద్దతు ప్రకటించారు. ఆలస్యమైనా ఆయన మద్దతు పలికారంటే ఉద్యమానికి ఊపు వస్తుందని, మిత్రపక్షమైన బీజేపీ అగ్రనేతలను ఒప్పించి నిర్ణయం మార్చుకునేలా చేస్తారని పోరాట కమిటీ ప్రతినిధులు, ఉద్యోగులు ఆశించారు. కానీ గత నెలలో ప్లాంట్ వద్ద సభలో పాల్గొన్న పవన్ కేంద్రాన్ని, బీజేపీని పల్లెత్తు మాట అనకపోగా.. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు డెడ్ లైన్ కూడా పెట్టారు. నెల రోజుల తర్వాత తీరిగ్గా ఈ నెల 12న మంగళగిరిలో నిరసన దీక్ష పెట్టినప్పుడు కూడా ప్రశ్నించాల్సిన కేంద్రాన్ని వదిలి రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, తన మిత్రపక్షమైన బీజేపీని కదిలించకుండా అప్పుడప్పుడు వచ్చి దీక్షలు, సభలు చేస్తే ప్రయోజనం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నీ మద్దతు ఇంతేనా పవన్ అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పవన్ వింత వ్యాఖ్యలు.. విచిత్ర రాజకీయం