iDreamPost
android-app
ios-app

విశాఖ ఉక్కు -రేపటి ఏపీ బంద్ కి అన్ని పక్షాల మద్ధతు, రాష్ట్రమంతా నిలిచిపోనున్న రవాణా

  • Published Mar 04, 2021 | 12:27 PM Updated Updated Mar 04, 2021 | 12:27 PM
విశాఖ ఉక్కు -రేపటి ఏపీ బంద్ కి అన్ని పక్షాల మద్ధతు, రాష్ట్రమంతా నిలిచిపోనున్న రవాణా

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపునకు అన్ని పార్టీలు మద్ధతు పలికాయి. ప్రభుత్వం కూడా సంఘీభావం తెలిపింది. శుక్రవారం నాటి బంద్ కి వైఎస్సార్సీపీ పూర్తి అండదండలనిస్తుందని ప్రకటించారు. వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు బంద్ సన్నాహాల్లో ఉన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు, ఛాంబర్ కామర్స్ వంటివి మద్ధతుగా తమ సంస్థలు మూతవేస్తున్నట్టు ప్రకటించారు.

అదే సమయంలో ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. దాంతో ఏపీలో బంద్ కారణంగా రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోతే సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ బంద్ లో తాము కూడా పాల్గొంటామని టీడీపీ ప్రకటించింది. ఏపీలో బీజేపీ, జనసేన మినహా అన్ని పార్టీలు విశాఖ ఉక్కు ఉద్యమానికి అండగా నిలవడం విశేషం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కార్మికులు, విశాఖ వాసులు వ్యతిరేకిస్తున్నారు .ఇప్పటికే ఆందోళనలు నిర్వహించారు. పలు రకాల కార్యక్రమాలు సాగుతున్నాయి. వాటిని కొనసాగింపులో భాగంగా రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం తర్వాత విశాఖ ఉక్కు వేదికపై వైఎస్సార్సీపీ, టీడీపీ సహా అన్ని పార్టీల నేతలు కనిపించారు.

ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కుని కాపాడాలని ముక్తకంఠంతో కోరారు. స్టీల్ ప్లాంట్ వద్ద నిత్యం దీక్షలు కొనసాగిస్తూ ప్లాంట్ ని కాపాడుకునే వరకూ ఉద్యమిస్తామని చెబుతున్న తరుణంలో అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావడం విశేషం. అదే సమయంలో తొలుత విశాఖ ఉక్కుని కాపాడుతామని చెప్పిన బీజేపీ నేతలు ఆ తర్వాత కేంద్రం పెద్దల ఆదేశాలతో మాట మార్చడం ఆసక్తిగా కనిపిస్తోంది. జనసేన కూడా కార్మికులకు దూరమవుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రేపటి ఏపీ బంద్ కార్యక్రమం విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు దోహదపడుతుందని ఆందోళనకారులు భావిస్తుననారు. అన్ని ప్రధాన పార్టీలు మద్ధతునివ్వడం, స్వయంగా సీఎం కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో స్పష్టంగా ఉండడంతో రేపటి బంద్ పిలుపునకు ప్రజలు ఏమేరకు సహకరిస్తారన్నది చూడాలి. గతంలో రైతులకు మద్ధతుగా సాగిన డిసెంబర్ లో బంద్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న బంద్ ఇదే కావడం విశేషం.