iDreamPost
android-app
ios-app

40 రోజుల్లో స్టార్ హీరో సినిమా పూర్తి

  • Published Nov 07, 2020 | 6:47 AM Updated Updated Nov 07, 2020 | 6:47 AM
40 రోజుల్లో స్టార్ హీరో సినిమా పూర్తి

ఈ మధ్యకాలంలో తెలుగు నిర్మాతలు మలయాళం రీమేకుల వెంట పడుతున్న సంగతి తెలిసిందే. కంటెంట్ విషయంలో వాళ్ళతో పోటీ పడలేరని మన రచయితల మీద అపనమ్మకమో లేక అంత కన్నా గొప్పగా రాయలేమనే భ్రమనో తెలియదు కానీ ఇంకో అంశంలో కూడా మల్లు వుడ్ స్ఫూర్తిగా నిలుస్తోంది. 2014లో వచ్చిన వెంకటేష్ దృశ్యం ఎంత పెద్ద హిట్టో గుర్తుందిగా. ఇక్కడ సక్సెస్ అనిపించుకుంది కానీ ఒరిజినల్ వెర్షన్ అప్పట్లో కేరళ పాత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. కోట్ల రూపాయలు వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. స్టార్ గా తిరుగులేని స్థానంలో ఉన్న మోహన్ లాల్ మార్కెట్ ని ఇంకా బలపరిచింది.

ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా పూర్తయిపోయింది. కేవలం 40 రోజుల్లో అది కూడా కరోనా నిబంధనలు కఠినంగా ఉన్న పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఫినిష్ చేశారు. మీనానే హీరోయిన్ గా నటిస్తుండగా పెద్దమ్మాయి తప్ప మిగిలిన క్యాస్టింగ్ అంతా దాదాపు అదే కొనసాగింది. ఫస్ట్ పార్ట్ లో పోలీస్ స్టేషన్ పునాదుల్లో శవాన్ని పాతిపెట్టిన మన హీరోకు ఆ తర్వాత ఎదురైన పరిణామాలు ఏమిటి అనే పాయింట్ మీద దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సీక్వెల్ ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో రూపొందించినట్టుగా టాక్. అతి తక్కువ సమయంలో మోహన్ లాల్ లాంటి స్టార్ ని డీల్ చేయడం అంటే మాములు విషయం కాదు.

పైగా ఇతనూ ఆరు పదుల వయసు ఉన్న సీనియర్ హీరో. అయినప్పటికీ ఇంత హుషారుగా దృశ్యం 2ని త్వరగా పూర్తి చేయడంలో సహకరించడం మెచ్చుకోదగ్గ విషయం. ఇంకా టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే హీరోలు సెట్లకు వెళ్లేందుకు సాహసం చేస్తున్నారు. అలాంటిది కంప్లీట్ యాక్టర్ బిరుదు ఉన్న మోహన్ లాల్ కమిట్ మెంట్ ని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. దృశ్యం 2 తెలుగులో రీమేక్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. చేస్తే వెంకీనే చేయాలి లేదంటే డబ్బింగ్ చేసుకోవడం ఉత్తమం. అలా కాదని వేరే హీరోతో ట్రై చేస్తే మాత్రం రిస్క్ అవ్వొచ్చు. దృశ్యం 2 కన్నా ముందు మోహన్ లాల్ భారీ మల్టీ స్టారర్ మరక్కార్ విడుదల కావాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోలేదు.