iDreamPost
iDreamPost
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూట్ లో జాయినైన చరణ్ ప్రీ లుక్ ని వెనుక వైపు నుంచి చెవి పోగు, మెడలో రుద్రాక్ష మాలతో కేవలం మెడ భాగం మాత్రం కనిపించేలా చిన్న పోస్టర్ విడుదల చేయడం ఫ్యాన్స్ లో హుషారు నింపింది. సిద్దాగా ఇందులో చరణ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది. ముఖ్యంగా చిరంజీవితో కాంబినేషన్ సీన్లు ఓ రేంజ్ లో వస్తున్నాయని, ఇంటర్వల్ బ్లాక్ నుంచి ఎలివేషన్లు మాములుగా ఉండవని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంచితే చరణ్ పోషిస్తున్న సిద్దాకు జోడిగా హీరొయిన్ పూజా హెగ్డే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే. దీని గురించి చాలా రోజులుగా ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందు రష్మిక మందన్న అన్నారు. తర్వాత మళ్ళీ అంతా సైలెంట్. కొంతకాలం కీయరా అద్వానీ, రాశి ఖన్నాల గురించి న్యూస్ వచ్చాయి. కానీ అవేవి నిజమా కాదా అనే నిర్ధారణ యూనిట్ ఇవ్వలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసింది. గతంలో రంగస్థలంలో జిగేలు రాణిగా ఐటెం సాంగ్ లో మెరిసిన పూజా హెగ్డే ఇప్పుడున్న స్టార్ లందరి సరసన ఫుల్ లెంత్ హీరొయిన్ గా చేసింది కానీ ఒక్క చరణ్ మాత్రమే బాలన్స్ ఉన్నాడు.
ఇప్పుడు ఆచార్యతో ఆ కొరత కూడా తీరబోతోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఆచార్య షూటింగ్ లో వేగం పెరిగింది. ఎలాగైనా మేలో విడుదల చేయాలనే సంకల్పంతో టీం గట్టిగానే కష్టపడుతోంది. మరోవైపు చిరు వచ్చే నెల నుంచి లూసిఫర్ రీమేక్ లో పాల్గొంటారు. ఆలోగా ఆచార్య పూర్తి కాకుంటే రెండూ పారలల్ గా జరుగుతాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఆచార్యలో చరణ్, పూజాల మీద ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట. ఇది కాకుండా చిరు చరణ్ లతో కూడా మరో ప్రత్యేకమైన గీతం ప్లాన్ చేసినట్టుగా వినికిడి.