బుల్లితె రాములమ్మ శ్రీముఖి, బిగ్‌బాస్ రియాల్టీ షోతో మరింతగా తన పాపులారిటీ పెంచుకున్న విషయం విదితమే. తృటిలో టైటిల్ కొట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నా, రన్నరప్‌గా నిలిచింది బిగ్‌బాస్ మూడో సీజన్‌లో. ఇక, ఆ తర్వాత షరామామూలుగానే బుల్లితెరపై సందడి పునఃప్రారంభించిన శ్రీముఖి.. చాలా షోస్ చేస్తూ వచ్చింది. ఇక, ఇప్పుడు తనే స్వయంగా ఓ ఆసక్తికరమైన టాక్ షోకి శ్రీకారం చుట్టింది. ‘ఓ ఉమేనియా’ అనేది ఈ టాక్ షో టైటిల్. ఈ టాక్ షో ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీముఖి అంటేనే అల్లరి. ఆ అల్లరికి అందం తోడైతే, ఆ కిక్కు ఎలా వుంటుందో చాలా షోస్‌తో చూశాం. ఈసారి అంతకు మించిన సందడి చేయబోతోందట ‘ఓ ఉమేనియా’ టాక్ షోతో శ్రీముఖి. కాస్త బొద్దుగా కన్పిస్తుండడంతో శ్రీముఖిపై ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఎక్కువగానే వున్నా, ఆమె ఫాలోవర్స్ మాత్రం, శ్రీముఖి హాట్ అప్పీల్‌కీ, క్యూట్ అప్పీయరెన్స్‌కీ ఫిదా అయిపోతున్నారు. బుల్లితెరపై శ్రీముఖి కొత్త టాక్ షో అనేక సంచలనాలకు కేంద్ర బిందువవుతుందని వారంతా ఆశిస్తున్నారు. బోల్డంతమంది సెలబ్రిటీలు, అందునా మహిళా ప్రముఖులు ఈ టాక్‌షోలో శ్రీముఖితో బోల్డన్ని ముచ్చట్లు చెప్పబోతున్నారట. ఆ వివరాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. టాలీవుడ్‌కి చెందిన ఓ మహిళా సెలబ్రిటీతో ఈ టాక్ షో లాంచ్ కానుందని సమాచారం.