Idream media
Idream media
1980లో ఆకలి రాజ్యం సినిమా చూసే వరకు శ్రీశ్రీ గురించి నాకు పెద్దగా తెలియదు. సినిమా పాటల కవిగా మాత్రమే పరిచయం. ఆకలిరాజ్యం సినిమా వచ్చిన నేపథ్యంలో దేశంలో అసలు పరిస్థితులు బాగాలేవు. ఎమర్జెన్సీ పోయింది. ఇందిరమ్మ ఓడింది. జనతా ప్రభుత్వం విఫలమైంది. యువతకు చిన్న ఉపాధి కూడా లేని కాలం.
అప్పుడప్పుడే ఇంజనీరింగ్ చదువు పిచ్చి మొదలైంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. డబ్బులున్న వాళ్లు డొనేషన్ కట్టి కర్నాటకలో చదివే వాళ్లు. అనంతపురం, తిరుపతి, వరంగల్, కాకినాడ, హైద్రాబాద్ ఇలా అతి తక్కువ ఊళ్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. మెడిసిన్ ఊహించుకోవడం కూడా కష్టం. డిగ్రీ , పీజీ కాలేజీలు ఫుల్‌గా ఉండేవి. చదివి బయటికొస్తే ఉద్యోగాలు లేవు. బ్యాంక్, గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్లు ఎప్పుడో ఒకసారి పడితే లక్షల్లో రాసేవాళ్లు. ఒక మామూలు మధ్య తరగతి యువకుడు బతుకు కోసం నిరాశగా ఎదురు చూస్తున్న రోజుల్లో ఆకలి రాజ్యం సినిమా వచ్చింది.
కమలహాసన్ గొంతులో నుంచి తూటాల్లా దూసుకొస్తున్న శ్రీశ్రీ కవితలకు యువకులు చప్పట్లు కొట్టారు. ఆ సినిమా చూసిన వెంటనే విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో మహాప్రస్థానం కొని చదవడం ప్రారంభించాను. ఉన్మాదంతో , ఉత్సాహంతో , ఆవేశ ఆగ్రహాలతో చదివా. అలా చదవడం వల్లే నా జర్నలిస్టు కెరీర్‌లో హెడ్డింగుల కోసం, పదాల కోసం ఎప్పుడూ పెద్దగా తడుము కోలేదు.
1981లో శ్రీశ్రీ అనంతపురం వచ్చాడు. సాయిబాబా కాలేజీలో మీటింగ్. కిక్కిరిసిపోయింది. కానీ శ్రీశ్రీ Bad Speaker. ఆయన కవిత్వంలాగే ఉపన్యాసం కూడా ఉంటుందనుకుంటే బాగా నిరాశ పడుతాం. ఆయన మాట్లాడింది అక్షరం అర్థం కాలేదు. కొందర్ని చదవాలే తప్ప వినకూడదు. అదే విధంగా కొందర్ని కలుసుకోకూడదు.
శ్రీశ్రీ జ్వరం చాలా కాలం వెంటాడింది. 1983 , జూన్ 15న ఆయన చనిపోయారు. చాలా బాధగా అనిపించింది. ఆంధ్రజ్యోతి వీక్లీలో శ్రీశ్రీ కవర్ పేజీ వస్తే దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని చాలా కాలం దాచుకున్నా. ఆయనకి ఆకలేసినప్పుడు రాసిన కవిత్వమే నిలబడింది. కడుపు నిండిన తర్వాత రాసింది పెద్దగా నిలబడలేదు.
రచయితకి కడుపు నిండితే , అక్షరం బక్కచిక్కిపోతుంది. ఇదో శాపం.