iDreamPost
android-app
ios-app

శ్రీ రాముడు నేపాల్ దేవుడా…? ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బిజెపి: నెటిజన్లు సెటైర్లు

శ్రీ రాముడు నేపాల్ దేవుడా…? ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బిజెపి: నెటిజన్లు సెటైర్లు

నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి సరికొత్త వివాదానికి తెరలేపారు. శ్రీ రాముడు నేపాల్ కు చెందిన దేవుడని ప్రకటించారు. శ్రీ రాముడు మూలాలు నేపాల్‌లోనే ఉన్నాయని పేర్కనడం రాజకీయ రంగ పులుముకుంది. కాంగ్రెస్, బిజెపిలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఏమన్నారంటే..?నేపాల్‌లో ఉన్న అయోధ్యే అసలైన అయోధ్య అని…శ్రీరాముడి జన్మస్థానం దక్షిణ నేపాల్‌లోని థోడిలో ఉందంటూ కొత్త వాదనను వినిపించారు. వాల్మీకి రామాయణాన్ని నేపాలీలోకి అనువదించిన కవి భానుభక్త (1814-1868) జయంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు.

“సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. సీతాదేవి నేపాల్‌కు చెందిన యువరాణి అన్నారు. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే రాముని జ‌న్మ‌స్థానంగా చెప్పుకుంటున్న అయోధ్య ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో లేదు, నిజమైన అయోధ్య నేపాల్‌లో బిర్‌గుంజ్‌కు పశ్చిమాన ఉన్న థోడీలో ఉంది. ఇప్పుడు భార‌త్‌లో ఉన్న అయోధ్య క‌ల్పితం” అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

“నేపాల్‌లోనే రాముడు జన్మించాడు. అయితే, రాముడి జన్మస్థానం భారత్‌లోని అయోధ్యేనని భారతీయులు వాదిస్తున్నారు. అక్కడి అయోధ్యపై పెద్ద వివాదం ఉంది. కానీ నేపాల్‌లోని అయోధ్యపై ఎలాంటి వివాదం లేదు’’ అని ఓలి వెల్లడించారు.

అంతేకాకుండా ఎలాంటి క‌మ్యూనికేష‌న్ లేని కాలంలో సీత‌ను వివాహం చేసుకోవ‌డానికి రాముడు జ‌న‌క్‌పూర్‌కు ఎలా వ‌చ్చాడంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత భార‌త‌దేశంలోని ఆయోధ్య నుంచి రాముడు జ‌న‌క్‌పూర్‌కు రావ‌డం అసాధ్య‌మంటూ పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్, బిజెపి ఖండించాయి.

హిందువుల ఆరాధ్య దైవమైన‌ శ్రీరాముడు నేపాల్ దేశ‌స్థుడంటూ ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై భార‌తీయులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ”అయ్యో.. రాముడేం ఖ‌ర్మ‌, విశ్వంలో ఉన్న అన్ని గ్ర‌హాలు మీవే” అంటూ సెటైర్లు  వేస్తున్నారు. దీనిపై భార‌తీయ ప్ర‌జ‌లు ట్విట‌ర్‌లో ఓలిని విమ‌ర్శిస్తూ త‌మ‌దైన శైలిలో చుర‌క‌లంటిస్తున్నారు. “ప్ర‌స్తుతమున్న నేపాల్ 2025 క‌ల్లా ప్ర‌పంచ దేశాల‌ను ఆక్ర‌మించుకుంటుంది. ఆ త‌రువాత 2030 క‌ల్లా అంత‌రిక్షంలోని గ్ర‌హాల‌ను, అనంత‌రం అంత‌రిక్షాన్ని, మొత్తం అనంత విశ్వాన్నే ఆక్ర‌మించుకుంటుంది”‌ అని ఓ నెటిజ‌న్ పేర్కొన్నారు. 

“రానున్న రోజుల్లో నేపాల్  ప్ర‌ధాని ఇలా అంటారు.. న్యూయార్క్ అమెరికాలో లేదు, నేపాల్‌లో ఉంది. అంతెందుకు ఆస్ట్రేలియా కూడా నేపాల్‌దే. టోక్యో, పారిస్ లండ‌న్, బెర్లిన్‌, సూడాన్‌, బ్యాంకాక్‌, లాస్ వెగాస్‌, ఇస్లామాబాద్ అన్నీ నేపాల్‌వే. నేపాల్‌వాసినైనందుకు నాకు గ‌ర్వంగా ఉంది”, “ఆయన్ను అలాగే వ‌దిలేస్తే రావ‌ణుడు చైనా, గౌత‌మ్ బుద్ధుడు రష్యా, మ‌హ‌వీర్ నార్త్ పోల్ నుంచి వ‌చ్చాడంటారు” ‌అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

“రాముడు నేపాల్ వాస్త‌వ్యులా.. ఇదెప్పుడు జ‌రిగింది?” అంటూ మీమ్స్‌ రాయుళ్లు ఫ‌న్నీ క్యాప్ష‌న్‌లతో చెల‌రేగిపోతున్నారు. కాగా ఓలి.. వాల్మీకి ఆశ్ర‌మం కూడా నేపాల్‌లోనే ఉంద‌ని, ద‌శ‌రథుడు త‌మ దేశాన్ని పాలించేవాడ‌ని, అత‌ని కొడుకు రాముడు కూడా ఇక్క‌డే పుట్టాడ‌ని వాదించ‌గా వాటిని భార‌తీయులు కొట్టిపారేశారు. 

నేపాల్ ప్ర‌ధాని మ‌తిస్థిమితం కోల్పోయారు

నేపాల్ ప్రధాని కెపి ఓలీ ఒక వింత ప్రకటన చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. శ్రీరాముడు నేపాలీ అని, భారతదేశంలో నకిలీ అయోధ్య ఉందంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. రాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య నేపాల్‌లోనే ఉంద‌ని, శ్రీరాముడు నేపాల్ దేశ‌స్తుడంటూ ప్ర‌క‌టించిన నేపాల్ ప్ర‌ధానిపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత‌ అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ నేపాల్ ప్రధాని మ‌తిస్థిమితం కోల్పోయిన‌ట్లున్నార‌ని అన్నారు. నేపాల్ ప్రధాని చైనా ఆదేశాల మేర‌కే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నార‌ని, మ‌తిస్థిమితం కోల్పోయిన‌ట్లు క‌నిపిస్తున్నార‌ని ధ్వజమెత్తారు.

ఓలీ మానసిక దివాలాకోరుతనం బయటపడింది

శ్రీరాముని జన్మ స్థలం, జాతీయత విషయంలో నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తప్పుబట్టారు. ఓలీ తన మానసిక దివాలాకోరుతనాన్ని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. ‘‘మర్యాదా పురుషోత్తముడు ప్రభు శ్రీరాముని జన్మ స్థలం గురించి నేపాల్‌కు చెందిన ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆయన మానసిక దివాలాకోరుతనాన్ని చూపుతోంది’’ అని పేర్కొన్నారు. ‘‘నేపాల్ గతంలో ఆర్యావర్తం (భారతదేశం)లో భాగమేనని ఓలీ తెలుసుకోవాలి’’ అని మౌర్య పేర్కొన్నారు. 

నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలీ తన సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గ‌తంలోనూ భార‌త భూభాగంలోని లిపియధుర, లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు త‌మ‌వేనంటూ నేపాల్ ప్ర‌ధాని ఓలీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్ప‌డు రాముడు నేపాలీ దేశ‌స్తుడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే నేపాల్‌ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్‌ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇటీవ‌లి కాలంలో ఆయన భారత్‌కు వ్యతిరేకంగా ప‌లు విమర్శ‌లు చేస్తూవ‌స్తున్నారు.