iDreamPost
android-app
ios-app

కథ సమాప్తం – ముగింపు వసూళ్లు

  • Published Mar 31, 2021 | 5:22 AM Updated Updated Mar 31, 2021 | 5:22 AM
కథ సమాప్తం – ముగింపు వసూళ్లు

వరస డిజాస్టర్ల తర్వాత ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంతో శర్వానంద్ చేసిన శ్రీకారం కూడా చివరికి నిరాశ కలిగించే ఫలితాన్నే మిగిల్చింది. దాదాపు అన్ని సెంటర్లలో సెలవు తీసుకున్న ఈ సినిమా ప్రధాన కేంద్రాల్లో మాత్రం రెండు మూడు షోలతో బరువుగా రన్ అవుతోంది కానీ వసూళ్లు మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న జాతరత్నాలు అదే రోజు విడుదల కావడం కొంత ప్రభావం చూపించినప్పటికీ కంటెంట్ పరంగానూ శ్రీకారం మరీ సందేశాల బరువుతో మోతెక్కించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఫైనల్ గా డిజాస్టర్ ముద్ర తప్పలేదు.

సుమారుగా 17 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న శ్రీకారం షేర్ రూపంలో రాబట్టుకుంది కేవలం 9 కోట్ల 64 లక్షలు మాత్రమే. అంటే అతికష్టం మీద సగాన్ని దాటగలిగింది కానీ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోలేదు. యూనిట్ ప్రమోషన్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిరంజీవి, కేటీఆర్ లు అతిధులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసినా లాభం లేకపోయింది. మొదటి వారం టికెట్ ధరలు పెంచడం కూడా ప్రభావం చూపించింది. ఏ కొత్త సినిమా అయినా గుడ్డిగా అధిక ధరలకు టికెట్లు కొనమని జనాలు స్పష్టంగా చెబుతున్నా కూడా నిర్మాతల్లో మార్పు రావడం లేదు. ఏరియాల వారిగా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి

శ్రీకారం ఫుల్ రన్ వసూళ్లు:

ఏరియా  షేర్ 
నైజాం  2.86cr
సీడెడ్  1.66cr
ఉత్తరాంధ్ర  1.21cr
గుంటూరు  0.99cr
క్రిష్ణ  0.53cr
ఈస్ట్ గోదావరి  0.74cr
వెస్ట్ గోదావరి  0.50cr
నెల్లూరు  0.32cr
ఆంధ్ర+తెలంగాణా  8.82cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.28cr
ఓవర్సీస్  0.54cr
ప్రపంచవ్యాప్తంగా 9.64cr

ఇక్కడి ఫిగర్స్ ని బట్టి శ్రీకారం ఏ స్థాయి ఫలితాన్ని అందుకుందో క్లియర్ గా చెప్పొచ్చు. ఇందులో మార్పు ఉండే అవకాశాలు దాదాపు లేనట్టే. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది కాబట్టి ఇకపై డిజిటల్ లోనైనా మంచి స్పందన దక్కే ఛాన్స్ ఉంది. కంటెంట్ లో మెసేజ్ ఉంటే చాలదు దాన్ని ఆడియన్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించేలా ఉండాలని గత ఏడాది జాను నేర్పిస్తే ఈ ఏడాది శ్రీకారం దాన్ని ఖరారు చేసింది. మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టిన శర్వానంద్ ఇప్పుడు ఆశలన్నీ ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి రూపొందిస్తున్న మహాసముద్రం మీదే ఉన్నాయి. సిద్దార్థ్ కూడా ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Verdict: Disaster