iDreamPost
iDreamPost
ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు అనంతపురం జిల్లా టీడీపీని తీవ్రంగా కుంగదీశాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో దాదాపు అన్ని మండలాల్లో ఆ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఒక్క ఎంపీపీ అధ్యక్ష పదవైనా దక్కించుకునే పరిస్థితి లేదు. అలాగే రెండు జెడ్పీటీసీలు మాత్రమే దక్కడంతో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి ఆశలు కూడా గల్లంతు అయ్యాయి. ఒకప్పుడు కంచుకోట లాంటి జిల్లాలో ఈ ఘోర పరాభావానికి మండల స్థాయిలో ఎక్కడికక్కడ ముదిరిపోయిన గ్రూప్ తగాదాలే కారణమని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉన్నా వినియోగించుకోవడంలో నేతలు విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బహిష్కరించామనడం బూటకమే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించడం వల్లే వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాలు సాధించిందన్న నేతలు సమర్థించుకోవడాన్ని టీడీపీ కార్యకర్తలతోపాటు ప్రజలు తప్పు పడుతున్నారు. పోలింగుకు కొద్దిరోజుల ముందు పార్టీ అధిష్టానం ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేసింది. కానీ బ్యాలెట్ పేపర్లో టీడీపీ గుర్తు ఉంది.. పోటీలో ఉన్న పార్టీ అభ్యర్థులు ప్రచారాలు చేశారు. అటువంటప్పుడు ఓటమికి బహిష్కరణ కారణమని ఎలా చెబుతామని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సరే.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తామని నేతలు ప్రగల్భాలు పాలకడాన్ని కూడా కార్యకర్తలు అంగీకరించడం లేదు. 2019 ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఇలా వరుస ఎన్నికల్లో ఓడిపోవడంతో గ్రామస్థాయిలో పార్టీ బలహీన పడిందని.. అటువంటప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా సత్తా చాటగలమని అంటున్నారు. పార్టీ దారుణ ఓటమిని నిజాయితీగా అంగీకరించి తప్పులు సరిదిద్దుకోకపోతే పార్టీ పూర్తిగా మునిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
Also Read : తెలంగాణలో చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం?
నానాటికీ దిగదుడుపు
జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లు తయారైంది. 2009లో 29 జెడ్పీటీసీ, 387 ఎంపీటీలు,
2014 ఎన్నికల్లో 45 జెడ్పీటీసీ, 525 ఎంపీటీసీలు గెలుచుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా నేలబారు ఫలితాలు సాధించింది. జిల్లాలో 62 మండలాలు ఉంటే రెండంటే రెండే జెడ్పీటీసీలకే పరిమితం అయ్యింది. 841 ఎంపీటీసీలకు గానూ 50 చోట్ల మాత్రమే గెలవగలిగింది. ఏకంగా 26 మండలాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మరో 13 మండలాల్లో ఒక్కో స్థానానికి పరిమితం అయ్యింది. మిగిలిన మండలాల్లో ఒకటి మించి స్థానాలు సాధించినా ఏ మండలంలోనూ సింగిల్ డిజిట్ దాటలేదు.
2014 ఎన్నికల తర్వాత నుంచే జిల్లాలో గ్రూప్ తగాదాలు మొదలయ్యాయి. అయితే అధికారం మత్తులో ఉన్న నేతలు వాటిని పట్టించుకోలేదు. దాంతో 2019 సార్వత్రిక ఎన్నికలపై దాని ప్రభావం పడింది. వాటికి జగన్ గాలి తోడుకావడంతో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఆనాటి పరాభవం తర్వాత కూడా పార్టీలో కుమ్ములాటలు తగ్గకపోగా మరింత ముదిరిపోయాయి. వాటికి తోడు గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసి.. టీడీపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు.
Also Read : వయసైపోతోంది నాయకా..!