మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యేక పరిణామం విపరీతమైన చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే (ఎస్ ఏ బాబ్డే) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ కావడం రాజకీయంగా చర్చలకు తావిచ్చింది. మాజీ సీజేఐ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆరెస్సెస్ వర్గాలు ఈ భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నా చర్చలకు తెరపడటంలేదు. మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన బీజేపీ మళ్లీ బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన కార్యాలయంలో గంటసేపు భేటీ
ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన బాబ్డే సుర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ను కలుసుకున్నారు. ఇరువురూ గంటసేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వారి చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది వెల్లడి కాలేదు. బాబ్డే స్వస్థలం నాగపూరే.. ఆ నగరంతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. అక్కడే చాలా ఏళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సీజేఐ గా పదవీవిరమణ చేసిన అనంతరం ఢిల్లీతో పాటు నాగపూర్లో ఎక్కువ కాలం గడుపుతున్నారు. అయితే నాగపూర్లోనే ఉన్న ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం, భగవత్ ను కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
బీజేపీలో చేరికకేనా?
శివసేనతో తెగదెంపులతో మహారాష్ట్రలో అధికారానికి దూరమైన భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగేలా బలోపేతం కావడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్ర పార్టీలో బలమైన నేతగా ఉన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రత్యేక వ్యూహాలతో పార్టీలోకి కొత్త వారిని ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. దీనికి సహజంగానే ఆరెస్సెస్ అండదండలు ఉంటాయి. తాజాగా మోహన్ భగవత్, బాబ్డేల భేటీకి అదీ కారణం అయ్యుండొచ్చని భావిస్తున్నారు.
బాబ్డేకు ముందు సీజేఐగా పనిచేసిన రంజన్ గొగోయ్ ని పదవీవిరమణ అనంతరం కేంద్రలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పట్లో దీనిపై విమర్శలు వినిపించాయి. రామజన్మభూమి వివాదంలో బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకే ఆయన్ను ఎంపీ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. బాబ్డే కూడా అయోధ్య కేసు తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన భేటీ చర్చనీయాంశంగా మారింది.
Also Read : బెంగాల్ లో అ’పొజిషన్’ మారుతూనే ఉందిగా..