iDreamPost
android-app
ios-app

వడిసెలలో సంధించిన సమ్మోహనాస్త్రం కొండపొలం

  • Published Oct 09, 2021 | 10:50 AM Updated Updated Oct 09, 2021 | 10:50 AM
వడిసెలలో సంధించిన సమ్మోహనాస్త్రం కొండపొలం

పురాణ గాథల్లో యుద్దాల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఎక్కువగా వినిపించే ఆయుధాల పేర్లు విల్లు , అమ్ములు (శరం , బాణం , నాచారం) . ఈ బాణాల్లో పలు రకాలు ఉన్నట్లు ప్రస్తావన . ఆగ్నేయాస్త్రం , వారుణాస్త్రం , నాగస్త్రం , బ్రహ్మాస్త్రం అలాగే సమ్మోహనాస్త్రం . మిగతా అస్త్రాలు శత్రు నిర్మూలనకు వాడితే సమ్మోహనాస్త్రం మాత్రం జనాన్ని మైమరపింప చేసి అచేతనంగా చూస్తూ ఉండిపోయేట్లు చేస్తుంది .

ఆ సమ్మోహనాస్త్ర ప్రయోగం అస్త్రశస్త్ర నైపుణ్యం కలిగిన యుద్ధవీరులే కాదు , ఒక గొఱ్ఱెలు కాసుకొనే సామాన్య యువకుడి చేతి వడిసెల ద్వారా కూడా ప్రయోగించవచ్చు అని తన కొండపొలం నవల ద్వారా రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి నిరూపిస్తే దానికి దృశ్యరూపంతో కొండపొలం సినిమా ద్వారా క్రిష్ నిరూపించాడు .

సినీ చరిత్రలోకి తొంగి చూస్తే చాలా మంది రచయితల నవలలని ఆధారం చేసుకుని భిన్న నేపద్యాలతో పలు సినిమాలు రూపొంది విజయాలు సాధించాయి . యద్దనపూడి సులోచనా , యండమూరి , కోడూరి కౌసల్య , మల్లాది వంటి వారి రచనలు స్వల్ప మార్పులతో పూర్తి స్థాయి సినిమాలుగా రూపొందగా మధుబాబు , మల్లాది , కొమ్మనాపల్లి , కొమ్మూరి వంటి డైనమిక్ రైటర్స్ నవలలలో కొంత భాగాన్ని తీసుకొని రూపొందిన సినిమాలు , కాపీ కొట్టిన సినిమాలు కూడా విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి . అయితే సినిమా కళ వ్యాపకం దశ దాటి కమర్షియల్ దశలోకి మారిన క్రమంలో నవలలకి సినిమాకి సంభందం దాదాపు తెగిపోయింది అని చెప్పొచ్చు . గత రెండు దశాబ్దాలలో పూర్తి స్థాయి సినిమాగా రూపొందిన నవల ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి .

Also Read : కలానికి దక్కిన గౌరవం – కొండపొలం

గత రెండు దశాబ్దాలుగా శరవేగంగా జరిగిన మార్పులతో డిజిటల్ ప్రపంచంలో చిక్కుకుపోయిన మనిషి పఠనాసక్తిని కోల్పోయాడు . ఫలితంగా నవలా ప్రపంచం తన ప్రాభవాన్ని దాదాపు కోల్పోయింది . అలాగని నవలా ప్రస్థానం పూర్తిగా ఆగిపోలేదు . అద్భుతమైన రచనా పటిమ సహజంగా అబ్బిన కొందరు ఉత్తమ రచయితల నుండి సాధారణ జీవితాల్లో తొంగి చూస్తూ అభిరుచి కల పాఠకుల చేత ఆసాంతం చదివించే కథలు , నవలలు వెలువడుతూ పుస్తక ప్రపంచానికి ఊపిరిలూదుతూ ఉన్నాయి . అలాంటి ఉత్తమ రచనల్లో ఒకటిగా నిలిచిందే సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారు రచించిన కొండపొలం .

సినీ ప్రపంచం కూడా కమర్షియల్ మాయలో చిక్కుకొని ఒకే మూస ధోరణిలో పోతూ సామాన్య జీవితాల్లో ఉండే భిన్న కధాoశాలతో కూడిన నవలా ప్రపంచం నుండి కథలు ఎన్నుకోవడం మానేసింది . ఫలితంగా మూస పోసినట్టు ఉండే ప్రేమ , పగ , రాజకీయం లాంటి మూడు నాలుగు అంశాలే కథలుగా మళ్లీ మళ్లీ సినిమాలు వస్తున్నాయి కానీ కొత్త కథతో , సరికొత్త అంశాలతో ప్రేక్షకులని అలరించే సినిమాలు రావటం అరుదు అయిపోయింది . ఆ కొరత కొంతకాలం క్రితం రంగస్థలం తీర్చగా ప్రస్తుతం కొండపొలం కథని సినిమా కదాంశంగా ఎంచుకొని అదే పేరుతో సినిమా తీయడం ద్వారా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఓ తాజా అనుభూతి గల సినిమాని అందించటమే కాకుండా సినిమాకి , నవలకి సంబంధాన్ని పునరుద్ధరించాడు అని చెప్పొచ్చు .

కొండపొలం పుస్తకం చదవాల్సిందే , సినిమా చూడాల్సిందే తప్ప నాలుగు ముక్కల్లో చెబితే అసంపూర్ణమే . అయినా కథా పరిచయం కోసం నాలుగు అంశాలు చూసొద్దాం . ప్రేక్షకులని అలరించటానికి కొండపొలం నవలని కొన్ని చిన్న మార్పులతో సినిమాగా తీసినా కథా మూలానికి ఎక్కడా దూరం జరగలేదు .

Also Read : కొండపొలం యాత్ర నుంచి సినిమా వరకు

రవి అనే ఓ గొఱ్ఱెల కాపరి కుమారుడు IFS(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) ఇంటర్వ్యూతో మొదలయ్యే సినిమా ఇంటర్వ్యూలో అతను ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు అన్న ప్రశ్నకు అడవి నుండి సర్ అనే సమాధానంతో సినిమాలోకి ప్రవేశించిన తర్వాత మొదలయ్యే కథ వారితో పాటు మనల్ని కూడా అడవిలోకి తీసుకెళ్తుంది . విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సరైన ఉద్యోగం దొరక్క గ్రామీణ నేపధ్యం మూలంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడలేక ఆత్మవిశ్వాస లోపంతో పలు ఇంటర్వ్యూల్లో విఫలం అయిన రవి వాళ్ళ తాత కోట ప్రోద్భలంతో తండ్రికి తోడుగా గొఱ్ఱెలు కాయడం కోసం అడవిలో అడుగు పెడతాడు . ఇలా అడవిలో గొఱ్ఱెలు మేపుకు వచ్చే ప్రక్రియనే కొండపొలం అంటారు .

పొట్టేలు తగిలనట్టు తగలాల , నువ్వు అంత తలపడినట్టు నాకవపడలేదు అన్న తాత మాట సినిమా చూసే చాలా మందిని ఆలోచనల్లోకి తీసుకెళ్తుంది . “మంద గోర్లు తినేసి ఉంటాడు ఆడి సదువుకి” అని రవి తండ్రి సాటి గొఱ్ఱెల కాపరితో చెప్పుకొంటూ పడే బాధ నేడు తమ పిల్లల కోసం లక్షల్లో ఖర్చు చేస్తూ అప్పుల పాలయ్యే , ఆస్తులమ్మి చదివించే తల్లిదండ్రుల కష్టానికి అద్దం పడుతోంది .

అడవిలో అడుగు పెట్టిన దగ్గర్నుండీ అనుక్షణం భయపడుతున్న హీరోకి అడవి తీరు , ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ,అక్కడ ఎలా వ్యవహరించాలో వివరిస్తూ ధైర్యం చెబుతున్న తండ్రి , పక్కనే ఉంటూ హీరోని ఉద్దేశించి, సదూకొన్న గొఱ్ఱె సదూకొని గొఱ్ఱెలతో మాట్లాడటం చూసారా ఎగతాళి చేసున్న ఓబులమ్మ (రకుల్) , “చిక్కి ఎదిరిచ్చే దానికన్నా ఎల్లి ఎక్కిరించటం మేలు” అంటూ క్లిష్టమైన జీవిత సత్యాలు ఒక్క ముక్కలో తేల్చి చెప్పే తాత లాంటి పాత్రలు కమర్షియల్ సినిమా కథల్లో మనకి కానరావు . ఇలా క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన ఉత్తమ రచయితల కలం నుండి జాలువారాల్సిందే .

Also Read : గొర్రెల కాప‌రుల జీవ‌న సంగీతం కొండ‌పొలం

ఆత్మన్యూనతా భావంతో సతమతమవుతున్న కథానాయకుడు అడవిలో పులిని , సమాజంలో క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడో చివరికి ఏమయ్యాడో రాసిన , చూపిన తీరు హృదయానికి హత్తుకొంటుంది . రాయలసీమ నేపధ్యం నుండి తీసిన సినిమా కావడం వలన సంభాషణల్లో సీమ యాసతో నడిపించినా క్లిష్టమయిన పదాల జోలి పోయి అభాసుపాలు కాకుండా సరళంగా అందర్నీ మెప్పిస్తూ నడిపించే ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చింది .

సినిమాలోని నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు . అయితే రవికి సాటి గొఱ్ఱెల కాపరిగా నటించిన రవి ప్రకాష్ , హీరో తండ్రి పాత్రధారి , తాత పోటీపడి కథలో నిజమైన పాత్రధారులుగా జీవించారు . కెరీర్ లో మొదటి సినిమాలోనే భిన్నమైన కథ ఎంచుకొని తన పట్ల ఆసక్తి కలిగించుకొన్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమాతో తన పై జనాలకు అంచనాలు కలిగించే ప్రయత్నం చేసాడు .

అయితే నటన పరంగా వైష్ణవ్ తేజ్ మరింత మెరుగు కావాల్సి ఉంది , ముఖ్యంగా హావభావాల విషయంలో . కోపాన్ని , బాధని వ్యక్తం చేసినంతగా , రొమాన్స్ , కామెడీ విషయంలో మొహంలో భావ ప్రకటనలో స్పష్టత లేదు . ఈ విషయంలో చాలా మెరుగు అవ్వాల్సి ఉంది . రొమాన్స్ చేసే సమయంలో అయోమయంతో కూడిన చూపులు ఏ అమ్మాయి అంగీకరించలేదు . అలాగే చివరిలో స్థిరంగా గంభీరంగా డైలాగ్లు చెప్పాల్సిన సందర్భంలో కొంత తడబడినట్టు కనబడుతోంది . సినిమాలో వైష్ణవ్ ని పదే పదే టీజ్ చేస్తూ కనిపించిన రకుల్ “నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోయింది” అనే పాటతో టీజ్ చేసుంటే హీరో నవ్వేవాడేమో .

ఇన్స్టిట్యూట్ ట్రైనర్ గా డైరెక్టర్ క్రిష్ ఒక నిమిషం నటించడం సినిమాలో మరో విశేషం . 

Also Read : చంద్రగిరి శిఖరం