అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ హోరాహోరీగా తలపడుతున్న విషయం తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమలా హారిస్ గెలుపుకోసం తమిళనాడులో పూజలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కమలా హారిస్ పూర్వీకులది తమిళనాడు కావడం గమనార్హం. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువరూర్ జిల్లా మన్నార్‌గుడి తాలూకా తుళసేంద్రపురానికి చెందినవారు. భారత మాజీ దౌత్యవేత్త పీవీ గోపాలన్ పెద్ద కూతురు శ్యామలకు కమలా హారిస్ జన్మించారు. కాగా అమెరికాకు వలస వెళ్లి అక్కడ ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న కమలా హారిస్ పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు.
తులసేంద్రపురం గ్రామంలోని అయ్యనార్ దేవాలయంలో కమల హారిస్ గెలుపుకోసం మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు.శివుడి అంశల్లో ఒకరుగా ఈ దేవుడిని కొలుస్తారు. తమ గ్రామం నుంచి వలసవెళ్లిన కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికాలో ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడుతుండటాన్ని ఆ గ్రామస్థులు గర్వంగా భావిస్తు కమల హారిస్ కోసం పూజలు నిర్వహించడమే కాకుండా గ్రామం మొత్తం కమలా హారిస్ ఫ్లెక్సీలు, పోస్టర్లతో నింపేశారు. కాగా మరి కొన్నిగంటల్లో కమలాహారిస్ భవితవ్యం తేలనుంది.