iDreamPost
iDreamPost
తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక, కేంద్రపాలిత ప్రాంతం యానాంను కలుపుతూ నిర్మించిన బాలయోగి వారధి కోనసీమవాసుల చిరకాల వాంఛకు నిలువెత్తు నిదర్శనం. మూడు పక్కలా గోదావరి ఒకపక్క సముద్రంతో పచ్చదనం పరుచుకుని ప్రకృతి అందాలకు పట్టుగొమ్మగా వుండే కోనసీమ నుంచి జిల్లా కేంద్రమైన కాకినాడ వెళ్లాలంటే జనం నానా అవస్థలు పడాల్సి వచ్చేది. కొబ్బరి, ఆక్వా ఉత్పత్తులను కోనసీమ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలంటే నావలు, పంటులే ఆధారంగా ఉండేవి. డబ్బు, సమయం వృథా అయ్యేవి. ఈ సమస్యలకు పరిష్కారంగా యానాం- ఎదుర్లంక మధ్య బ్రిడ్డి నిర్మించాలని జనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
బాలయోగి చొరవతో కల సాకారం
కోనసీమ వాసిగా ఈ సమస్యపై అవగాహన ఉన్న మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి ఈ వంతెన నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవుండే (1800 మీటర్లు) ఈ వారధి నిర్మాణాన్ని 33 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. దానికి దాదాపు 110 కోట్ల రూపాయలను సమకూర్చడంలోగాని, బ్రిడ్జికి వివిధ రకాల అనుమతులు రప్పించడంలోగాని, పనులు పూర్తయ్యే వరకు అధికారులను పరుగులు పెట్టించడంలోగాని బాలయోగి చేసిన కృషి మరువలేనిది. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి ప్రభుత్వాల నడుమ సమన్వయం సాధించి బ్రిడ్డిని వేగంగా పూర్తిచేయడానికి బాలయోగి చాలా శ్రమించారు.
Also Read : P Gannavaram Aqueduct – రాజోలు దీవి చరిత్రను మార్చిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?
వివిధ మార్గాల్లో నిధుల సేకరణ
బిడ్జ్రి నిర్మాణానికి 109 ఎకరాల భూమిని సేకరించ వలసి వచ్చింది. ఇందులో దాదాపు 12 ఎకరాలు ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి ప్రభుత్వాలు ఇవ్వగా, మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించారు. అవసరమైన నిధులను బాలయోగి వివిధ మార్గాల్లో సేకరించారు. కేంద్ర ప్రభుత్వ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.24.50 కోట్లను సమకూర్చాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ రూ.16 కోట్లు, గెయిల్ రూ.4 కోట్లు అందించాయి. పాండిచ్చేరి ప్రభుత్వం రూ.4.5 కోట్లు ఇచ్చింది. కోనసీమ ప్రాంత రైతులు, కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ సంయుక్తంగా రూ.20 కోట్లు సమకూర్చాయి. విశాఖపట్నంకు చెందిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ 33 నెలల రికార్డు సమయంలో ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ కంపెనీ 15 ఏళ్లపాటు టోల్ వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వగా ఆ గడువు కూడా ముగిసింది.
ఎంతో ఉపయోగం..
కోనసీమను జిల్లాకు కలిపే రెండో వంతెన ఇది. జొన్నాడ- రావులపాలెం వంతెన మొదటిది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దశాబ్దాల తరబడి కోనసీమ వాసులు రవాణాకు పడిన కష్టాలు గట్టెక్కాయి. కోనసీమలోని వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు కాకినాడ పోర్టుకు, విశాఖపట్నం పోర్టుకు తరలించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. డబ్బు, సమయం ఆదా అవుతోంది.
2002లో అక్టోబర్‌లో ప్రారంభం..
కోనసీమ వాసుల కలల వారధి అయిన యానాం- ఎదుర్లంక బ్రిడ్జిని నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2002లో అక్టోబర్1న ప్రారంభించారు. అన్ని సజావుగా జరిగినా ఈ బ్రిడ్జి కోసం ఎంతో శ్రమించిన, పరితపించిన బాలయోగి ప్రారంభోత్సవ సమయానికి లేకపోవడం విషాదం. ఆయన 2002 మార్చి మూడవ తేదీన కృష్ణాజిల్లా కైకలూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన కృషికి గుర్తుగా బ్రిడ్జికి బాలయోగి వారధిగా పేరు పెట్టారు. ఆయన పుట్టిన రోజైన అక్టోబర్ ఒకటో తేదీనే దీన్ని ప్రారంభించి బాలయోగికి నివాళులు అర్పించారు.
Also Read : Bridge On River Vasishta – జగన్ చొరవతో… వశిష్ఠ నదిపై మీద మరో వారధి