iDreamPost
iDreamPost
చిళ్ల పెంకుకు అల్లుడు అని పేరు పెడితే తుళ్లి తుళ్లి పడుతుందంటారు. అల్లుడు అన్న పదానికి ఉన్న పవర్ అలాంటిది. పెళ్లయిన కొత్తలో అయితే అల్లుడు గారు వస్తున్నారంటే అత్తింటిలో ఉండే హడావిడే వేరు. ఈయన కోసం అన్నీ ప్రత్యేకంగా రూపు దిద్దుకోవడాలు, తయారు చేయడాలు, ఆ మర్యాదలు అబ్బో.. తలచుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. మరదలు ఆట పట్టించడం, బావమరిది మన సేవలో తరించడం.. ఆందరూ మన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండడం.. ఓహ్ ఆ ఫీలింగే ఫెంటాస్టిక్. అసలు అల్లుడు గారూ.. అని అత్తమామలు పిలవగానే వచ్చే పులకరింతే వేరు. అలాంటి పులకరింప జేసే పలకరింపునకు శాశ్వతంగా దూరంగా ఉంటున్నవారు ఎందరో..
పరిపూర్ణత కోసం..
పెళ్లి.. జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం.
వివాహ వ్యవస్థ అనే చట్రం వెలుపల ఉన్నవారు లోపలికి, అందులో ఉన్నవారు బయటకి వెళ్లడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారని కొందరు చమత్కారంగా వ్యాఖ్యానిస్తుంటారు. పెళ్లికి ముందు.. ఆ తర్వాతగా జీవితాన్ని లెక్కగ ట్టేవారు ఎందరో.. కొందరు పెళ్లిని ఆవశ్యక క్లేశంగా భావిస్తే మరికొందరు అదే సర్వస్వంగా అనుకుంటారు. సోలో బతుకే సో బెటర్ అనేవారు కొందరు. మాఘమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు కొందరు. సినిమాల్లో కూడా పెళ్లికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 90 శాతానికి పైగా కథలు పెళ్లి కావడంతోనే ముగుస్తాయి. హీరో, హీరోయిన్లకు పెళ్లి చేయకుండా సినిమాను ముగిస్తే ప్రేక్షకులకు అసంతృప్తి. అందుకే పెళ్లి అనే ఘట్టం పూర్తికాకపోతే జీవితానికి పరిపూర్ణత సిద్దించనట్టే చాలామంది భావిస్తారు. అలాంటి పరిపూర్ణత కరువై పెళ్లికానివారు రాను రాను పెరిగిపోతున్నారు.
పెళ్లి కాని ప్రసాదులు..
ఈ మాట అనేవారికి, వినేవారికి సరదాగా ఉన్నా ఆ దశను అనుభవిస్తున్న వాళ్ళకు మాత్రం అవమానంగా, గౌరవ భంగంగా ఉంటుంది. వివిధ కారణాలతో దేశవ్యాప్తంగా పెళ్ళికాకు డా ఉండి పొయే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒక్క మగాళ్లనే కాకుండా ఆడవారిలోనూ ఇలా మిగిలిపోతున్నవారు గణనీయంగానే ఉంటున్నారు.
ఇవీ లెక్కలు..
తాజా లెక్కల ప్రకారం మనదేశంలో 50.3శాతం మంది పెళ్లి కాని ఉన్నారు. ఇదే 2001లో అయితే పెళ్లికాని మగవారు 49.8 శాతం ఉంటే.. ఆడవారు 54.4 శాతం ఉన్నారు. 2020లో సేకరించిన లెక్కల ప్రకారం ప్రతి 100 మంది ఆడవారికి 108.18 మగవారు ఉన్నారు. అదే 1950లో ఈ శాతం 105 ఉంది. క్రమంగా పెరుగుతూ 2021 నాటికి 108 శాతానికి చేరింది. ఒక అంచనా ప్రకారం 2100 నాటికి ప్రతి వందమంది ఆడవారికి 103 మంది మగవారు ఉంటారు. అంటే ఈ శతాబ్దాంతానికి కూడా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య తగ్గదన్న మాట.
ఆడ మగ నిష్పత్తులు..
2020లో జరిగిన ఓ సర్వే ప్రకారం 20-24 వయసు గ్రూపులో ప్రతి వందమంది అమ్మాయిలకు 112 మంది అబ్బాయిలు ఉన్నారు. 25-29 ఏజ్ గ్రూపులో 112 మంది, 30-34 ఏజ్ గ్రూపులో 110 వంది, 35-39 గ్రూపులో 109 వంది, 40-49 గ్రూపులో 106 మంది చొప్పున అబ్బాయిలు ఉన్నారు. ఇలా ఏ వయసు గ్రూపులో చూసినా మొత్తంపై అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా పెళ్లి కుమార్తెల కొరతతో అబ్బాయిలు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు.
ఆలోచనా ధోరణిలో మార్పు..
గడచిన 25-30 ఏళ్లుగా అమ్మాయిల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు కూడా పెళ్లిళ్లు జరుపుకొనే వయసు వాయిదా పడడానికి కారణమవుతోంది. గతంలోలా కాకుండా తనకు కచ్ఛితంగా ఉద్యోగస్తుడే కావాలని పట్టుబడుతున్నారు. కోరుకున్న లక్షణాలున్న వరుడు దొరికే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు, కుల వృత్తులు చేసుకొనే అబ్బాయిలకు పెళ్లికుమార్తెలు దొరకడం కష్టమవుతోంది. ఇక అబ్బాయిలు కూడా ఉద్యోగంలో బాగా స్థిరపడిన తరువాతనే పెళ్లి చేసుకుందామనే ధోరణితో ఉంటున్నారు. అలా ఇరువైపుల నుంచి కొనసాగుతున్న వాయిదాల పర్వంతో పెళ్లి ప్రక్రియ లేటు అవుతోంది.
చాలామంది విషయంలో ఇది ఓ జీవితకాలం లేటుగా పరిణమిస్తోంది. క్రమంగా ఇది ఒక సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోయామనే బెంగ చాలామంది తల్లిదండ్రులను వేధిస్తోంది. తాము ఇన్నాళ్లు పెళ్లి వాయిదా వేసి తప్పు చేశామనే ఫీలింగ్ ఇటు వీరికి కలుగుతోంది. ఏ వయసుకు ఆ ముచ్చట అంటారు. కెరీర్ ఎంత ముఖ్యమో వివాహం కూడా అంత ముఖ్యమన్న సంగతి గ్రహించి సకాలంలో నిర్ణయం తీసుకోవడం కీలకం.
శుభస్య శీఘ్రం..
ఒకప్పుడు అంటే 1950 ప్రాంతాల్లో చాలా దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెళ్లి అయిన వారి శాతం ఎక్కువగా ఉండేది. ప్రస్తుత ఈ స్థితిని అధిగమించి మళ్లీ పెళ్లి బాజాలు ప్రతి ఒక్కరి జీవితంలో సకాలంలో మోగాలని కోరుకుందాం. …