ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా చూసీ చూడనట్లు పోతూ ఉంటారు చాలామంది. లేదా ఆ ప్రమాదాన్ని సెల్ ఫోన్లలో బంధించేందుకు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేందుకు మాత్రమే ఎక్కువగా ముందుకు వస్తున్నారు. అంతేతప్ప ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసే ఉద్దేశ్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. కళ్ళముందు ప్రాణాలు పోతుంటేనే స్పందించే మనుషులు తక్కువున్న ఈ కాలంలో అదే కుళ్ళిపోయిన మృతదేహం ఉంటే ఎక్కువమంది చూసీ చూడనట్లు ముక్కు మూసుకుని పోతారు అనడం అతిశయోక్తి కాదు.
అలాంటిది అటవీ ప్రాంతంలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం గురించి సమాచారం వస్తే ఆ మృతదేహాన్ని కనీసం చూడటానికి కూడా ఎవరూ ఇష్టపడని పరిస్థితి ఉన్నప్పుడు ఆ మృతదేహాన్ని అరకిలోమీటర్ వరకూ స్వయంగా భుజాలపై మోసుకుంటూ వచ్చి దానికి అంత్యక్రియలు జరపడానికి ఆర్ధిక సహాయం చేసే గుణం ఎంతమందిలో ఉంటుంది.? ఒకవేళ అలా మృతదేహాన్ని మోసిన వ్యక్తి మహిళ అయితే, బాధ్యతాయుతమైన ఎస్సై వృత్తిలో ఉండి తానే మృతదేహాన్ని తరలించడానికి నడుం బిగిస్తే ఆ మహిళా ఎస్సై సేవా గుణం, తెగువ,ధైర్యాన్ని, తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమే.
అసలేం జరిగింది?
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవి కొత్తూరు గ్రామ పొలాల్లో ఒక కుళ్ళిపోయిన మృతదేహం ఉందని కాశీబుగ్గ పోలీసులకి సమాచారం అందింది. ఆ సమాచారం అందుకున్న స్టేషన్ ఎస్సై శిరీష మృతదేహం ఉన్న స్థలానికి బయల్దేరారు. కానీ అక్కడ చిన్న చిన్న అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా మృతదేహం ఉన్న ప్రదేశానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ మృతదేహం ఉన్న ప్రదేశానికి వెళ్లాలంటే పొలాల్లో నడుస్తూ అరకిలోమీటర్ కు పైగా వెళ్లాల్సిన పరిస్థితి. దాంతో తనతో పాటు వచ్చిన సిబ్బందితో నడుస్తూ మృతదేహం ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు శిరీష.
కానీ ఇక్కడే పెద్ద చిక్కొచ్చిపడింది. అక్కడున్న మృతదేహానికి ఒక 70 ఏళ్ల వయసుంటుంది. పైగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఆ మృతదేహాన్ని తరలించడం సమస్యగా తయారైంది. ఈ స్థితిలో స్థానికులను మృతదేహాన్ని తరలించడానికి సాయం చేయమని అడిగితే ఒక్కరూ ముందుకు రాలేదు. కానిస్టేబుళ్ళు కూడా మృతదేహం తరలించడానికి సంకోచిస్తున్నారు. ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ దశలో ఎస్సై శిరీష తానే మృతదేహాన్ని తరలించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం లలితా ఛారిటబుల్ ట్రస్ట్ పర్సన్ కి ఫోన్ చేసి స్ట్రెచర్ తీసుకు రమ్మని పురమాయించారు. వచ్చిన వ్యక్తి సహయంతో ఆ మృతదేహాన్ని స్ట్రెచర్ పై వేసుకుని కాలి నడకన పొలాలను దాటుతూ మృతదేహాన్ని దాదాపు అరకిలోమీటర్ కు పైగా మోసి జీపు వద్దకు తరలించిన ఎస్సై శిరీష అంత్యక్రియల కోసం లలితా ఛారిటబుల్ ట్రస్ట్ వారికి ఆ మృతదేహాన్ని అప్పగించి అందుకోసం కొంత ఆర్థికసాయం కూడా చేసారు. ఒక మహిళా ఎస్సై మానవతా దృక్పథంతో మృతదేహాన్ని మోసిన విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో శిరీష పేరు మారుమ్రోగింది.
ఎవరీ శిరీష?
శిరీష తండ్రి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు. వారి స్వస్థలం విశాఖపట్నంలోని రామా టాకీస్ ప్రాంతం. శిరీష డిగ్రీ వరకూ విశాఖపట్నంలోనే చదువుకుంది. 2014 వ సంవత్సరంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడంతో మద్దిలపాలెం ఎక్సైజ్ ఎస్పీ ఆఫీస్ లో సంవత్సరం పైగా పనిచేసింది. అనంతరం ఎనిమిది నెలలు ఉద్యోగానికి లీవ్ పెట్టి ఎస్సై పరీక్షలకు ప్రిపేర్ అయింది. ఇందుకోసం హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకుని ఎస్సై పరీక్షలు రాయగా ఆమె ఎస్సైగా సెలెక్ట్ అయింది. దాంతో శ్రీకాకుళం జిల్లాలోని నందిగామలో తొలి పోస్టింగ్ ఇచ్చారు. అనంతరం జి. సిగడాంలో ఎస్సైగా విధులు నిర్వర్తించగా ప్రస్తుతం కాశీబుగ్గలో స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్నారు.
కాగా మృతదేహాన్ని భుజాలపై మోస్తున్న శిరీష ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమ్రోగింది. హోంమంత్రితో పాటు డీజీపీ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులు ప్రత్యేకించి ఆమె సేవాగుణం గురించి ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా శిరీషకు గుర్తింపు లభించింది. ఇదే విషయం ఆమె వద్ద ప్రస్తావిస్తే నేనేమీ గొప్ప పని చేశానని అనుకోవడం లేదని ఇదంతా నా వృత్తిలో భాగమని తెలిపారు. ఎన్నో చోట్ల ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను తన వాహనంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించానని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ప్రమాదాల్లో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న శరీర భాగాలను గోనెసంచిలో మూటగట్టి తీసుకెళ్లిన రోజులు కూడా ఉన్నాయని ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినప్పుడు సమయానికి తీసుకురావడం వల్లనే గాయపడిన వ్యక్తులు బ్రతికారని వైద్యులు చెప్పినప్పుడు సంతోషం కలుగుతుందని ఎస్సై శిరీష వెల్లడించారు.
మృతదేహాన్ని మోయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంపై శిరీష స్పందిస్తూ మృతదేహాల విషయంలో కొందరికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయని వాటిని తప్పుబట్టలేమని అన్నారు. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని అందుకే తానే మృతదేహాన్ని మోసేందుకు ముందుకొచ్చానని శిరీష తెలిపారు.
కాగా ముక్కూమొహం తెలియని ఓ మృతదేహాన్ని భుజాల మీద మోసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళా ఎస్సై శిరీషను హోంమంత్రి సుచరితతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఆపదలో నేనున్నానంటూ వారికి బాసటగా నిలబడిన ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. తెలంగాణ పోలీసులు కూడా ఆమెలోని అంకితభావాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆమెలోని సేవా భావాన్ని కొనియాడారు. తాను చేస్తున్న పనులు సేవా కార్యక్రమాలు కావని తనకు అప్పగించిన విధులను తాను నిర్వర్తిస్తున్నానని ఎస్సై శిరీష స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని ఎస్సై శిరీష స్పష్టం చేశారు. ఆమె తన సేవా కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించాలని, వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనమూ కోరుకుందాం..