iDreamPost
iDreamPost
మనం సినిమాల్లోనే ఎక్కువ ప్రేమ కథలు చూస్తాం కానీ నిజ జీవితంలో సెలెబ్రిటీలకూ అంతకు మించిన డ్రామాతో కూడిన లవ్ స్టోరీస్ ఉంటాయి. హీరో హీరోయిన్లే కాదు గాయకులకు కూడా. అలాంటి స్వీట్ మెమరీనే గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం గారిది. అదేంటో చూద్దాం.బాలు శ్రీమతి పేరు సావిత్రి. పెళ్లి కాకముందే ఇద్దరూ దగ్గరి బంధువులు. ఏదో సందర్భంలో మనసు మనసు కలిసి ప్రేమలో పడ్డారు. ఒకే కులమైనంత మాత్రాన పెద్దలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇద్దరిదీ ఒకటే గోత్రం. సంప్రదాయాలకు విలువిచ్చే ఆ రెండు కుటుంబాల వాళ్ళు ఈ స్వగోత్ర వివాహానికి ససేమిరా అన్నారు.
ఇద్దరి మధ్య దూరం పెంచాలనే ఉద్దేశంతో సావిత్రిని ఆవిడ తల్లితండ్రులు మదరాసు నుంచి బెంగుళూరుకి షిఫ్ట్ చేశారు. కానీ బాలు పట్టుదల వేరే. ఎలాగైనా తన జీవిత భాగస్వామిని దక్కించుకోవాలని కంకణం కట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఓ సినిమాటిక్ ప్లాన్ వేశారు. ఓ ఫ్రెండ్ కారు తీసుకుని చక్కా బెంగుళూరు వెళ్లిపోయారు. ముందే సమాచారం అందించడంతో సావిత్రి కాంపౌండ్ బయట గేట్ దగ్గర సిద్ధంగా వెయిట్ చేస్తున్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా జర్నీ చేసి మద్రాసు వెళ్ళిపోయారు. తర్వాత రైల్వే స్టేషన్ నుంచి మెయిల్ లో విశాఖపట్నం చేరుకున్నారు ప్రేమ జంట. అక్కడి నుంచి నేరుగా సింహాచలం చేరుకొని నరసింహాస్వామి సమక్షంలో మిత్రుల సాక్షిగా సావిత్రి మెడలో మూడు ముళ్ళు వేశారు ఎస్పి బాలు.
మూడు రోజులు అయ్యాక ఇద్దరూ తిరిగి మదరాసు వచ్చి ఓ హోటల్ లో మకాం పెట్టారు. పాటల రికార్డింగుల కోసం బాలు అక్కడి నుంచే వెళ్లి వస్తు ఉండేవాళ్ళు. కొంతకాలం అయ్యాక అదే హోటల్ కు బాలు, సావిత్రి తల్లితండ్రులు వచ్చి తమ ఆశీర్వాదం అందించారు. మొదటి సంతానం పల్లవి పుట్టేదాకా పరిస్థితి కొంచెం అటుఇటుగానే ఉంది. ఆ తర్వాతే కుదుటపడింది. రెండోసారి సావిత్రి గర్భం దాల్చినప్పుడు బాలు ఆవిడ తల్లితో పాటు సావిత్రిని బెంగుళూరు పంపారు. ప్రయణం మధ్యలోనే నొప్పులు రావడంతో ఎమర్జెన్సీ కింద అరక్కోణం రైల్వే ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు సావిత్రి. అతనే చరణ్. తర్వాత గాయకుడిగా స్థిరపడ్డారు. ఇలా మనకు వేల పాటల ద్వారా విడిపోలేని అనుబంధం పెంచుకున్న ఎస్పి బాలసుబ్రమణ్యం వెనుక ఉన్న సాహసోపేత ప్రేమకథ ఇది. ఏ సినిమాకూ తీసిపోదు కదూ. అవును రియల్ స్టోరీస్ లో ఉండే కిక్కే వేరు..