iDreamPost
iDreamPost
అస్పష్టత లేదు.. అంతా స్పష్టతే. సందిగ్దాలు, సందేహాలు లేవు. అయోధ్య సమస్యకు ముగింపు పలకాలనే ఉద్దేశం సుప్రీం ధర్మాసనం లో ఉన్నట్లు తీర్పు సారాంశం చెబుతోంది. మరో వారం రోజుల్లో పదవి విరమణ చేయబోతోన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన విధుల ఆఖరి ఘడియల్లో చరిత్రలో నిలిచిపోయే సమస్యకు (అప్పీలు లు లేకుండా ఉంటే) పరిస్కారం చూపారు. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం.. అయోధ్య లోని వివాదస్పద భూమి 2.77 ఎకరాలు రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. అయోధ్య లోనే మసీదు నిర్మాణానికి 5 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తూ ఎవరిని నొప్పించకుండా సమస్యను పరిష్కరించింది. భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది.1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంటూ తీర్పును వెల్లడించింది.
అయోధ్య సమస్య దశాబ్దాల తరబడి దేశ ప్రజలను ఒకింత ఇబ్బందులకు గురి చేసింది. ఈ అంశం వెనుక రాజకీయ పార్టీలు ఉండడంతో తీర్పు అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కొన్ని రోజులుగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఈ రోజు వెలువరించిన తీర్పు, అనంతర పరిణామాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించాయి.
అయోధ్యపై వాదనలు ముగిసి, తీర్పు వెలువడుతుందన్న క్షణం నుంచీ తీర్పు ఎలా వచ్చినా దేశంలో శాంతియుత పరిస్థితులు ఉండేలా ఈ కేసులోని ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. అగ్ర నేతలు తమ వర్గం వారిని శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టేలా ప్రవర్తించరాదని చెప్పడం ఫలితాన్ని ఇచ్చింది. ప్రధాన పార్టీలు, నేతలు తీర్పు పై సానుకూలంగా స్పందించారు.
సమస్య ఏదైనా పరిష్కరించే సమయంలో ఇరువర్గాలకు సమన్యాయం జరగదు. తప్పని సరిగా అసంతృప్తి ఉంటుంది. ఐతే అది ఎంత తక్కువ ఉంటె అంత మంచిది. అయోధ్య తీర్పులో ధర్మాసనం విజ్ఞతతో, లౌక్యం ప్రదర్శించి ఇరువర్గాలను సంతృప్తి పరచేలా నిర్ణయం వెలువరించింది. తీర్పు వెలువరించి సుప్రీం తన బాధ్యతను నిర్వర్తించింది. ఇక దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ధర్మాసనం ఇచ్చిన గడువులోగా, వీలైనంత వేగంగా తీర్పును అమలు చేయడం పైనే సమస్య పరిస్కారం ఆధారపడి ఉంది. వచ్చే మూడు నెలలు అయోధ్య సమస్య పరిస్కారం లో కీలకమైన సమయం. ఏమైవుతుందో చూడాలి.