iDreamPost
android-app
ios-app

అమర్‌సింగ్‌ అస్తమయం

అమర్‌సింగ్‌ అస్తమయం

సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌ సింగ్‌ అస్తమించారు. 64 ఏళ్ల అమర్‌ సింగ్‌ ఈ ఏడాది మార్చి నుంచి అనారోగ్యం కారణంగా సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 2013లో ఆయన మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే ఆరోగ్యం విషయమించడంతో మార్చి నుంచి ఆయన సింగపూర్‌లోని ఆస్పత్రిలోనే చికిత్సలో ఉన్నారు. చికిత్స తీసుకుంటూనే ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

2015లో కూడా తీవ్ర అనారోగ్యంతో ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే విజయవంతంగా కోలుకున్నారు. మార్చిలో ఆయన సింగపూర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన చనిపోయారంటూ ఓ వీడియో వైరల్‌ అయింది. చికిత్స తీసుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించడంతో వదంతులకు చెక్‌ పడింది. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘడ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఈ రోజు ఉదయం కూడా ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో తన ఫాలోవర్లకు ఈద్‌ సుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

సమాజ్‌వాదీ పార్టీలో కీలక నేతగా ఉన్న అమర్‌ సింగ్‌ పలుమార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యలు నిర్వర్తించారు. సమాజ్‌వాదీ పార్టీ ఛీప్‌ ములాయం సింగ్‌ యాదవ్‌కు అమర్‌సింగ్‌ అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. 1996లో మొదటి సారి రాజ్యసభకు ఎన్నికైన అమర్‌సింగ్‌ రెండోసారి 2003లోనూ పెద్దల సభకు వెళ్లారు. అంతర్గత కలహాల వల్ల 2010లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే ములాయం సింగ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే 2016లో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో ములాయం సింగ్‌ తన పార్టీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి, అమర్‌సింగ్‌కు లైన్‌ క్లీయర్‌ చేశారు.

యూపీఏ 1 ప్రభుత్వానికి 2008లో కమ్యూనిస్టులు మద్ధతు ఉపసంహరించుకున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అమర్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారు. 2011లో పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసులో అమర్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యారు. కొంత కాలం తీహార్‌ జైలులో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో అప్పట్లో చురుకుగా వ్యవహరించిన తెలుగు నటి జయప్రద, అమర్‌సింగ్‌లు మిత్రులు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు అమర్‌సింగ్‌ మృతికి సంతాపం తెలిపారు.