iDreamPost
android-app
ios-app

Southern council Amit Sha -దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం, జగన్ ఎజెండా ఇదే

  • Published Nov 14, 2021 | 1:44 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Southern council Amit Sha -దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం, జగన్ ఎజెండా ఇదే

29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాలకు తిరుపతి నగరం సిద్ధమయ్యింది. సమావేశ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణా, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, అండమాన్, లక్షద్వీప్ కి చెందిన ముఖ్యమంత్రులు, కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు స్వయంగా కేంద్రం హోం మంత్రి సమక్షంలో సమావేశాలు జరుగుతాయి. దాని నిమిత్తం అమిత్ షా తో పాటుగా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తిరుపతికి చేరుకున్నారు. సీఎం జగన్ సహా ఏపీకి చెందిన నేతలు కూడా తిరుపతి తరలివెళ్లారు. ఈనేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. దానికి అనుగుణంగా భారీ ప్రణాళికతో సిద్దమయ్యింది. చర్చించాల్సిన ఎజెండాలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలకు చోటు దక్కించుకుంది. దాంతో వాటికి పరిష్కారం లభిస్తుందనే ఆశాభావంతో అడుగులు వేస్తోంది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాల వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించుకునే దిశలో ఈ సమావేశాలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఈనెల 3న సీఎం సన్నాహాక సమావేశం కూడా నిర్వహించారు. వివిధ శాఖల ముఖ్య అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, వివిధ పెండింగ్‌ సమస్యలను ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం కోరబోతున్నారు. దానికి కేంద్రం, వివిధ రాష్ట్రాల సహకారం కూడా లభిస్తుందని ఆశిస్తున్నారు. ప్రధానంగా రాష్రవిభజన చట్టంలోని హమీలతో పాటు అపరిష్కృత అంశాలను, పెండింగ్‌ బకాయిలను ప్రస్తావించబోతున్నారు.

కరోనా సహా వివిధ కారణాల రీత్యా మూడేళ్ల తర్వాత ఈ సమావేశం జరగబోతోంది. దాంతో ఈ సమావేశం ఆధారంగా కొన్ని సమస్యలకయినా పరిష్కారం సాధించాలని సీఎం ఆశిస్తున్నారు. అందులో భాగంగా కీలకమైన అంశాలను ఎజెండాలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ తరుపున ప్రస్తావించబోయే అంశాల్లో తెలుగుగంగకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలకు సంబంధించిన అంశం ఉంది. ఏపీకి అటు తెలంగాణా రాష్ట్రం నుంచి సివిల్ సప్లయిస్ బకాయిలతో పాటుగా విద్యుత్ బకాయిలు సుమారు రూ. 6వేల కోట్లున్నాయి. తమిళనాడు నుంచి తెలుగుగంగ బకాయిలు కూడా పెండింగులు ఉన్నాయి. వాటికి పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు.

Also Read : World Economic Forum, AP CM Jagan – వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం.. సీఎం జగన్‌కు ఆహ్వానం

కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించబోతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. డీపీఆర్ సవరణ విషయంలోనూ శ్రద్ధ చూపడం లేదు. దాంతో వాటిని ప్రస్తావించి పోలవరం నిధుల సాధన లక్ష్యంగా సాగుతున్నారు. అంతేగాకుండా విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఆ ఏడాదికి సంబంధించిన రెవెన్యూ లోటు పూడ్చేందుకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వాటిని కూడా ప్రస్తావించబోతున్నారు.

రేషన్ బియ్యం కేటాయింపులో హేతుబద్ధత కోసం ఏపీ ప్రభుత్వం ప్రస్తావించబోతోంది. ఏపీ విభజనకు సంబంధించిన పెండింగ్ విషయాలు కూడా చర్చకు పెట్టబోతోంది. ఎఫ్‌డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలను కూడా సమావేశం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం పట్టుబట్టబోతోంది. సాగునీటి పారుదలకు సంబంధించి కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే అంశాన్ని ఏపీ ప్రభుత్వం కోరబోతోంది. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల ప్రస్తావిస్తూ. రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలు కూడా సమావేశంలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది.
ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే విషయాల్లో కూడా సమర్థవంతంగా జోక్యం చేసుకునే దిశలో ఆలోచన చేస్తోంది.

అదే సమయంలో విభజన చట్టంలోని ప్రత్యేక హోదా సహా వివిధ విషయాలు కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. తద్వారా కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టబోతున్నారు. రాష్ట్రాభివృద్ధికి , ఉపాధి కల్పనకు తోడ్పడేలా కేంద్రం చేదోడు ఉండాలని సీఎం జగన్ కోరబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వివిధ అంశాలను సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషించే దిశలో ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేసింది. సమీక్షా సమావేశంలో అధికారులతో చర్చించిన పలు విషయాలు కూడా అవకాశం మేరకు ప్రస్తావించే లక్ష్యంతో ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు.

Also Read : Ap Government – అప్పులు- అభివృద్ధి- అసలు నిజాలు