iDreamPost
iDreamPost
భారత స్వాతంత్ర సమరంలో జలియన్ వాలా భాగ్ ది ప్రముఖ స్థానం,ఆ ఘటనలో అమరులైన వారిని నేటికీ స్మరించుకుంటాము. స్వతంత్ర పోరాటంలో భాగంగా తిరగబడ్డ ప్రజల మీద బ్రిటీష్ పోలీస్ దమనకాండ ప్రదర్శించింది. జలియన్ వాలా భాగ్ లాంటి సంఘటన మన వద్దా జరిగింది. ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన “విదుర అశ్వత్థ” క్షేత్రం దక్షిణ భారత జలియన్ వాలా భాగ్ గా పేరుపొందింది.
విదుర అశ్వత్థ పేరు వెనుక రెండు కోణాలు ఉన్నాయి. పెన్నానది ఒడ్డున విదురుడు మహావిష్ణువును అశ్వత్థ చెట్టు (రావి చెట్టు) రూపంలో ప్రతిష్టించి తపస్సు చేయటం వలన ఆప్రాంతానికి విదుర అశ్వత్థం అని పేరు వొచ్చిందని నమ్ముతారు.
అయితే చారిత్రకంగా వియజయనగర సామ్రాజ్య పతనం తరువాత ఆ ప్రాంతాన్ని ద్వారనాయక పాలెగాడు పాలించాడు. ఇప్పటికి ద్వారనాయక పాళ్యం (D.పాళ్యం) అనే ఊరు అక్కడ ఉంది.ఆ ద్వారనాయకుడి కుమారుడు విదుర నాయకుడు ఈ అశ్వత్థ క్షేత్రంలో రావి చెట్టును నాటాడని అతని పేరుతోనే అది విదుర అశ్వత్థం అని పేరు వొచ్చిందని మరికొంతమంది చెప్తారు. అనంతపురంలో తాడిపత్రి ప్రాంతంలో పప్పూరు వద్ద మరో అశ్వత్థం ఉంది.
ఈ విదుర అశ్వత్థం స్వాతంత్రపోరాటంలో కీలక భూమిక పోషించింది. 82 సంవత్సరాల క్రితం విదుర అశ్వత్థంలో ఒక తోటలో సమావేశమైన స్వాతంత్ర్య ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పులలో 32 మంది స్వాతంత్రోద్యమ కారులు ఆశ్రువులు బాశారు.”దక్షిణ భారత జలియన్ వాలాబాగ్”గా పేరొందిన అమానుష మారణకాండ 1938 ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున ఉన్న “విదుర అశ్వత్థం” గ్రామంలో జరిగింది.బ్రిటీష్ పాలనలో మైసూర్ రాష్ట్రంలో,ప్రస్తుత కర్నాటక రాష్ట్రంలోని గౌరీబిదనూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.విదురశ్వత్థ గాంధీ చూపిన అహింసా మార్గంలో నడిచిన గ్రామం.
దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర కాంక్షతో జాతీయ జెండాను ఎగర వేస్తున్నారు.ఆ సమయంలో బ్రిటిష్ పాలకులకు తొత్తుగా ఉన్న మైసూర్ దివాన్ సర్ మీర్జా తన పాలనా ప్రాంతంలో ఎక్కడా భారత జాతీయ పతాకం ఎగర వేయకూడదని ఆదేశాలు జారీ చేశాడు. మైసూర్ పాలకుల ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆనాటి కాంగ్రెస్ నాయకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కేటీ భాష్యం,హార్డేకర్, సిద్ధలింగయ్య,కేసీ రెడ్డి, రామాచార్యులు వంటివారంతా మాండ్యా జిల్లాలోని శివపురలో నిర్వహించే కాంగ్రెస్ సమావేశంలో జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు.కానీ ఈ విషయాన్ని పసిగట్టిన మైసూర్ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది.మూడు రోజుల కాంగ్రెస్ సమావేశాలలో నాయకులు జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించగా నాయకులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
శివపురలో తమ ప్రయత్నం విఫలమవడంతో విదుర అశ్వత్థం గ్రామంలో 1938 ఏప్రిల్ 18న ‘ధ్వజ సత్యాగ్రహ’ పేరుతో కార్యక్రమం నిర్వహించి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.ఎన్‌సీ నాగిరెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ధ్వజ సత్యాగ్రహ నిర్వహించడానికి జాతీయ జెండాలు చేతబూనిన ప్రజలు విదుర అశ్వత్థం వైపు కదిలారు.మరోవైపు ఆంధ్ర ప్రాంతం నుంచి కల్లూరు సుబ్బారావు నేతృత్వంలో ప్రజలు భారీగా తరలారు.
మైసూరు రాష్ట్రం,ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సత్యాగ్రహులంతా విదుర అశ్వత్థం చేరుకుని అక్కడి ఆలయం వెనుక ఉన్న తోటలో సమావేశమయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎన్‌సీ నాగిరెడ్డి, మరికొందరు నాయకులను అరెస్ట్ చేసి చిక్కబళ్లాపూర్ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఆజ్ఞను ధిక్కారించారన్న నేరంపై వారిని క్షమాపణ చెప్పమని న్యాయమూర్తి ఆదేశించారు.కానీ కాంగ్రెస్ నాయకులు అందుకు అంగీకరించకపోవడంతో వారందరినీ జైలులో పెట్టారు.
నాయకులను జైలులో పెట్టారన్న వార్తతో కోలార్ జిల్లా మొత్తం అట్టుడికిపోయింది.నాయకుల అరెస్టులను ఖండిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదురశ్వత్థ తోటలో సమావేశమైన సత్యాగ్రహులంతా ఆగ్రహావేశాలకు లోనయ్యారు.దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు,అదనపు పోలీసు బలగాలు వచ్చిపడ్డాయి. పోలీసులు భారీగా చుట్టుముట్టడంతో అక్కడి నుంచి ఎటూ కదలలేని పరిస్థితిలో సత్యాగ్రహులు ఆ తోటలోనే ఉండిపోయారు.
1938 ఏప్రిల్ 25 ఉదయం 10.30 గంటలకు గౌరీబిదనూరు,దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు విదుర అశ్వత్థంకు చేరుకున్నారు.అప్పటికే సుమారు 25 వేల మంది అక్కడ త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తున్నారు. ముందుగా నిర్ణయించిన సమయానికే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి సత్యాగ్రహులు సిద్ధపడగా పోలీసులు వారిపై తుపాకులు గురి పెట్టారు.
దీనికి జంకని నాయకులు జెండా ఎగరవేయడానికి ముందడుగు వేయగా పోలీసులు వేదులవేణి సూరన్న, నారాయణ స్వామి, శ్రీనివాసరావు,కల్లూరు సుబ్బారావు వంటి నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లారు.వారి అరెస్టులతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు రామాచార్యులు సత్యాగ్రహులను ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించారు.ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని మేజిస్ట్రేట్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.ఆయన అందుకు నిరాకరించడంతో ప్రజలపై లాఠీ చార్జి చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
అంతలో జిల్లా పోలీస్ సూపరింటిండెంట్ తన పిస్టల్ తీసి కాల్చాడు. అలాగే ఎస్పీతో పాటు అక్కడున్న పోలీసులూ తూటాల వర్షం కురిపించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఈ దారుణ మారణ కాండలో 32 మంది అక్కడికక్కడే వీరమరణం పొందగా,48 మంది గాయపడ్డారు .సత్యాగ్రహుల శవాలతో విదుర అశ్వత్థం లోని వనం శ్మశానంలా మారిపోయింది.
విదుర అశ్వత్థం విషాదం మహాత్మ గాంధీకి తెలిసేటప్పటికి ఆయన వార్ధాలో ఉన్నారు.ఈ దమనకాండపై ఏప్రిల్ 29న ఆయన విడుదల చేసిన ప్రకటనలో ”అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలనే ప్రయత్నంలో విదురశ్వత్థలో మరణించిన 32 మంది త్యాగం వృథా కాదు” అంటూ ఈ ఘటనను ఖండించారు.
ఈ ఘటనకు కారణమని ఆరోపణలున్న మైసూర్ దివాన్ సర్ మీర్జాకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి.దీంతో దివాన్ మీర్జా సమస్యని పరిష్కరించాలని గాంధీజీకి లేఖ రాయడంతో ఆయన వల్లభాయి పటేల్,ఆచార్య కృపలానీలను మైసూర్ పంపించారు.భారత ఉక్కు మనిషి పటేల్ నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని, నాయకులను విడుదల చేయాలని సూచించగా మైసూర్ దివాన్ అంగీకరించాడు.ఇక త్రివర్ణ పతాకం ఎగర వేయడంపైనా కూడా నిషేధం తొలగించాడు. దీనినే ‘పటేల్-మీర్జా’ ఒప్పందంగా చరిత్రకారులు పేర్కొంటారు.
ఇలాంటి స్వాతంత్ర పోరాటాల చరిత్రను పాఠశాల స్థాయిలో సిలబస్‌లో చేర్చి విద్యార్థులకు బోధించాలి. స్థానిక స్వాతంత్ర పోరాటాలకు ప్రభుత్వాలు గుర్తింపును ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది.