iDreamPost
iDreamPost
తొలి ఇన్నింగ్స్‌లో మంచి జోరు మీద ఉన్న భారత జట్టుకు వర్షం అడ్డంకిగా మారింది. సఫారీలతో జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజు సోమవారం సెంచూరియన్‌లో భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. మైదానంలో ఔట్ ఫీల్డ్‌లో నీరు నిలిచిపోవడంతో మరో దారిలేక రెండవ రోజు ఆట రద్దు చేశారు.
తొలుత వర్షం తగ్గితే ఆటను ప్రారంభిస్తామని మేనేజ్‌మెంట్ తెలిపింది. వర్షం తగ్గకపోవడానికి తోడు మైదానంలో నీరు నిలిచిపోవడంతో ఆటను రద్దు చేశారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. కె.ఎల్.రాహూల్ సెంచరీ సాధించి 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఆటగాడు రహానే 40 పరుగులతో క్రీజ్‌లో నిలిచాడు.
అయితే సెంచూరియన్‌లో రేపు వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ చెబుతుండడంతో మూడవ రోజు ఆట జరుగుతుందని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.