iDreamPost
iDreamPost
నాని వి ఓటిటికి ఓటేసి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక మెల్లగా ఒక్కొక్క స్టార్ సినిమా బయటికి వస్తోంది. థియేటర్లు తెరిచే పరిస్థితి కనుచూపు మేర కనిపించకపోవడంతో పాటు ఒకవేళ ఓపెన్ చేసినా జనం వస్తారన్న నమ్మకం లేకపోవడంతో విడుదల తేదీ ప్రకటనలు వచ్చేస్తున్నాయి. తాజాగా సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ కూడా OTT బాట పట్టింది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కాబోతోంది. ఇది ముందు నుంచి ఊహిస్తున్నదే అయినప్పటికీ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో గరంగరంగా ఉన్నారు కాబట్టి జరగదేమో అనుకున్నారు కానీ సూర్య మాత్రం ముందడుగు వేయడానికే నిర్ణయించుకున్నారు.
నిజానికి ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది సూర్యనే. భార్య జ్యోతిక నటించిన పొన్మగళ్ వందాల్ ని ఏప్రిల్ లోనే ఆన్ లైన్ లో వదిలి సంచలనం సృష్టించారు. పంపిణీదారులు ఎంత నిరసన వ్యక్తం చేసినా లెక్క చేయలేదు. చాలా బలమైన మార్కెట్ ఉన్న తన సినిమానే ఇప్పుడు డిజిటల్ కి సై అనడం కోలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం. సామాన్యుడికి అతి తక్కువ ధరకు విమానయానం అందించే లక్ష్యంలో సంస్థను స్థాపించిన ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ బయోపిక్ గా రూపొందిన ఆకాశమే నీ హద్దురాకు సుధా కొంగర దర్శకురాలు. వెంకటేష్ గురుని తీర్చిదిద్దిన విధానం మన ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. అందుకే దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ట్రైలర్ రూపంలో ఇప్పటికే మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 30కు ఇంకా రెండు నెలలకు పైగా టైం ఉంది. అప్పటిదాకా థియేటర్ల కోసం వేచి చూడకుండా ఇంత ముందుగా అనౌన్స్ మెంట్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు నాని వి, ఆకాశం నీ హద్దురా ప్రకటనలు చూశాక ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న ఇతర నిర్మాతలు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. కరోనా ప్రభావం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణలు వేరే అక్కర్లేదు