iDreamPost
iDreamPost
దేశంలో మీడియా సంస్థల మధ్య పోటీ పలు పరిణామాలకు దారితీస్తోంది. బడా సంస్థగా కనిపించిన జీ నెట్ వర్క్ కూడా కష్టాల్లో మునిగి చివరకు అమ్మకం పెట్టాల్సిన స్థితి వచ్చింది. దానిని సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా కొనుగోలు చేసింది. జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లో 52.93 శాతం వాటాను సోని సొంతం చేసుకుంది. తద్వారా దేశంలో స్టార్ అండ్ డిస్నీ ఇండియా నెట్ వర్క్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత సోనీ సంస్థకు 75 టీవీ చానెళ్లు, రెండు స్ట్రీమింగ్ యాప్ లు సోనీ లివ్, జీ 5 కూడా ఉన్నాయి. రెండు ఫిల్మ్ స్టూడియోలు, ఒక కంటెంట్ స్టూడియో కూడా ఉన్నట్టయ్యింది. దాంతో ఈ పరిణామం మీడియాలో మార్పులకు కీలక పరిణామంగా చెప్పవచ్చు.
ఇటీవల జీ గ్రూప్ తీవ్రంగా నష్టాలు పాలయ్యింది. కరోనా, ఆర్థిక సంక్షోభాలతో జీ గ్రూప్ మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని మీడియా సంస్థలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అడ్వర్టైజింగ్ మార్కెట్ కుచించుకుపోవడంతో ఆయా సంస్థలు అవస్థలు పడుతున్నాయి. ఇక నిర్వహణా లోపాలు, ఇతర కారణాలు కూడా కలిసి జీ సంస్థలో మెజార్టీ వాటాను అమ్ముకోవాల్సిన పరిస్థితికి నెట్టింది. ఈ నేపథ్యంలో సోనీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా జీ గ్రూప్ కి చెందిన పునీత్ గోయంకా ఉమ్మడి సంస్థకు నేతృత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు.
ఈ రెండు పెద్ద గ్రూపుల కలయిక మీడియాలో కేంద్రీకృతమవుతున్న పెత్తనాన్ని మరింత స్పష్టంగా చాటుతున్నాయి. ఇప్పటికే రిలయెన్స్ కి చెందిన న్యూస్ 18 సంస్థ వార్తల విభాగంలో సగానికి పైగా ఆక్రమించింది.ఇ ప్పుడు ఎంటర్టైన్మెంట్, న్యూస్ విభాగాల్లో జీ, సోనీ సంస్థల కలయిక అదే రీతిలో ప్రభావం చూపబోతోంది. ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్ చానెళ్ల విభాగంలో సోనీది కీలక స్థానం, జీ చానెళ్లు కూడా తోడయితే ఇది మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇక డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫాం లలో రెండు యాప్ ల సహాయంతో మరింత పట్టు సాధించేందుకు చాన్స్ వస్తుంది. తెలుగులో కూడా స్టార్ మా కి పోటీగా సోనీ , జీ తెలుగు చానెళ్లు మరింత యాక్టివ్ అయ్యే అవకాశం దక్కుతుంది.
మొత్తంగా 1991 తర్వాత దేశంలో ప్రైవేటు చానెళ్లకు అనుమతించిన తరుణంలో దేశంలో ప్రారంభమయిన మొదటి చానెళ్లలో ఒక్కటయిన జీ గ్రూప్ ప్రస్థానం సోనీలో అంతర్భాగం కావడంతో కీలక దశకు చేరినట్టు కనిపిస్తోంది. 30 ఏళ్ల పాటు సాగిన జీ సంస్థలు దేశంలోని అనేక మీడియా మార్పులకు కారణమయ్యింది. అలాంటి సంస్థ ఇప్పుడీ స్థితికి చేరడం ఆసక్తికరమే.
Also Read : చేతులు కలిపిన ఎంటర్ టైన్మెంట్ దిగ్గజాలు