iDreamPost
android-app
ios-app

సోనూసూద్‌కు అరుదైన గౌరవం

సోనూసూద్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ నటుడు సోనూసూద్‌కు అరుదైన గౌరవం లభించింది. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలకు గాను ఐక్యరాజ్య సమితి అవార్డు వరించింది. కరోనా విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా దేశమంతా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో సోనూసూద్ వారికి పెద్ద మనస్సుతో సాయం చేశారు. వలస కార్మికులకు మాత్రమే కాకుండా విద్యార్థులకు కూడా సేవలు అందించారు.

సోనూసూద్ లాక్‌డౌన్‌ కారణంగా కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల కష్టాలను చూసి చలించి పోయారు. తన సొంత ఖర్చుతో వలస కూలీలను తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేశారు.కార్మికులను విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక విమానాలను వాడటం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం. ఆయన అందించిన సేవలకు గాను ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆయనకు ‘ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు’ను ప్రకటించింది. గతంలో ఐక్యరాజ్య సమితి అవార్డు అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో సోనూసూద్ కూడా చేరిపోయారు. లియోనార్డో డి కాప్రియో,యాంజెలినా జోలీ,ప్రియాంకా చోప్రా తదితరులు ఐక్యరాజ్య సమితి అవార్డును గతంలో అందుకున్నారు.

తనకు ఐక్యరాజ్య సమితి అవార్డు రావడం పట్ల సోనూసూద్ ఆనందం వ్యక్తం చేశారు. తనకు చేతనైనంతలో ఏ విధమైన ప్రయోజనం ఆశించకుండా దేశప్రజలకు కొద్దిపాటి సాయాన్ని చేశానని కానీ నేను చేసిన సాయాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించడమే కాకుండా అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉందని తెలిపారు. కాగా ఈ అవార్డును ఆయనకు ఓ వర్చువల్‌ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం ప్రదానం చేశారు.