సాటి మనుషులు కష్టాల్లో ఉంటే కరిగిపోయి వారిని ఆదుకునేందుకు తనకు సాధ్యమైన రీతిలో ముందుకొచ్చే వారిలో ముందువరుసలోఉంటారు నటుడు సోనూసూద్.. గతంలో సోనూసూద్ లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు ప్రత్యేక విమానాలు,బస్సులు ఏర్పాటు చేసి దేశ ప్రజల మనసులను గెలుచుకున్నారు. సాటి మనిషికి కష్టం ఉందంటే చాలు సాయం చేయడానికి ముందుండే సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా ఉండటానికి ముందుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేటకు చెందిన మారయ్య, సరస్వతి దంపతుల కూతురు తేజశ్రీ(12) అనే బాలిక పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది.తల్లిదండ్రులు ఆమె వైద్య ఖర్చులకు ప్రతీ నెలా 20 వేల వరకూ ఖర్చు చేస్తున్నారు. కాగా లాక్‌డౌన్ కారణంగా పనులు లేక కుమార్తెకు మందులు కొనలేని స్థితిలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. దీంతో హైదరాబాద్ లో సోనూసూద్ షూటింగ్ లో ఉన్నట్లు తెలుసుకున్న మారయ్య మరియు సరస్వతి తమ కుమార్తె తేజశ్రీని తీసుకుని సోనూసూద్ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రాంతానికి వెళ్లి సోనూసూద్ ని కలిశారు.
తమకు ప్రస్తుతం కుమార్తెకు అవసరమైన మందులు కొనే స్తోమత కూడా లేదని తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని వివరించడంతో స్పందించిన సోనూసూద్ బాలిక మందుల కోసం అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా బాలికకు గుండె మార్పిడి చేయాల్సివస్తే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు కూడా తానే భరిస్తానని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి ముందుకొచ్చిన సోనూసూద్ కు తేజశ్రీ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను ఆదుకోవడానికి ముందుకొచ్చి మరోసారి తన ఉదారతను చూపిన సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.