iDreamPost
android-app
ios-app

BJP Somu Veerraju – బద్వేల్‌లో బీజేపీది నైతిక విజయమట!

  • Published Nov 02, 2021 | 3:02 PM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
BJP Somu Veerraju – బద్వేల్‌లో బీజేపీది నైతిక విజయమట!

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి. బద్వేల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ నైతిక విజయం సాధించిందని ఆయన వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో తాము ధర్మపోరాటం చేస్తే అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడి గెలిచిందని ఆరోపించేశారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఏం చేసిందో కరపత్రాల ద్వారా వివరించి మరీ తాము ఓటు అడిగామని చెప్పుకున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై రెండున్నరేళ్లలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో కనిపించిందన్నారు. సీఎం సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో హుజూరాబాద్‌ లాంటి ఫలితాలు బీజేపీ, జనసేనతో కలసి చూపించనున్నామని, తాము అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని తాము కేంద్రాన్ని కోరామని కూడా చెప్పారు.


జనం ఏమనుకుంటారో అన్న ధ్యాస లేదా!

ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న సోము వీర్రాజు బద్వేల్‌లో ఘోర ఓటమి చెందాక ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా, వారిని అవమానించేలా మాట్లాడడం తగునా? పార్టీ అధ్యక్షుడిగా ఓటమిని హుందాగా అంగీకరించాల్సింది పోయి ఇలా చౌకబారు విమర్శలు చేయడం ఎందుకు? అసలు బీజేపీది నైతిక విజయం ఎలా అవుతుంది? వీరి బలమెంతో తెలిసిన మిత్రపక్షం జనసేన కలసి రాకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి అభాసుపాలయ్యారు. పేరుకే ఒంటరి పోరు కానీ ఒకపక్క తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ ప్రాథేయపడి వారు మద్దతు తీసుకున్నారు. ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోబెట్టుకున్నారు. జనసేన, టీడీపీ నాయకులతో కలసి ప్రచారంలో పాల్గొన్నారు. కుమ్మక్కు రాజకీయం చేశారు. ఇదంతా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలుస్తూనే ఉంది. అయినా సరే తాము నీతివంతమైన రాజకీయాలు చేసేశామని చెప్పుకోవడానికి మించిన దివాళాకోరుతనం ఉంటుందా? తాము ధర్మపోరాటం చేస్తే అధికార పార్టీ రిగ్గింగ్‌ చేసిందని ప్రెస్‌మీట్‌ పెట్టి ఆరోపించేస్తే జనం నమ్మేస్తారా? కేవలం మెజార్టీ ఎంతో తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనం ఈ ఎన్నికపై ఆసక్తి చూపారు తప్ప బీజేపీ పోటీ చేసిందని, పోటీ ఉత్కంఠగా ఉందని, వీరు గెలిచేస్తారని అస్సలు ఎవ్వరూ అనుకోలేదు. తాము గెలిచే అవకాశం లేదన్న సంగతి సోము వీర్రాజుకూ తెలుసు. అయినా అధిష్టానానికి వాస్తవాన్ని చెప్పకుండా, పోటీలో పార్టీని నిలిపి డిపాజిట్‌ కూడా దక్కకుండా ఓడిపోయేలా చేసి బీజేపీ పరువును మంట గలిపారు.


రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పరేమి?

భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఏం చేసిందో కరపత్రాల ద్వారా వివరించి మరీ తాము ఓటు అడిగామని గొప్పగా చెబుతున్న సోమ వీర్రాజుకు ఏ పార్టీ అయినా ఓటు అలాగే అడుగుతుందన్న సంగతి తెలియదా? వైఎస్సార్‌ సీపీ కూడా రెండున్నరేళ్లలో తమ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటు అడిగింది. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో వివరించేందుకు ఏమీ లేక దేశవ్యాప్తంగా చేసిన సేవలు వివరిస్తే బద్వేల్‌ ఓటర్లు ఈయన పార్టీకి ఎందుకు ఓటు వేస్తారు. రాష్ఠ్ర ప్రజల ఉమ్మడి వాంఛ అయిన ప్రత్యేక హోదాను అటకెక్కించడం.. విభజన చట్టంలోని అంశాలను ఏడున్నరేళ్లుగా అమలు చేయక పోవడం.. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని ప్రయత్నించడం వంటి కీలక అంశాలు బీజేపీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఎప్పుడో దూరం చేశాయి. అందుకే అసలే ఇక్కడ బలం లేని ఆ పార్టీ ఈ ఉప ఎన్నికలో ఘోరంగా ఓడిపోయింది. వైఎస్సార్‌ సీపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే 90 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఎలా గెలుస్తుంది. ప్రతి ఎన్నికలోనూ అప్రతిహత విజయాలు సాధిస్తున్న వైఎస్సార్‌ సీపీకి జనంలో వ్యతిరేకత ఉంది అని మీరు నిజంగా భావిస్తుంటే అది మీ దృష్టి దోషం తప్ప వేరు కాదు.


నైతిక విజయం అంటే నైతిక బాధ్యత వహించరా?

పార్టీ డిపాజిట్‌ సైతం గల్లంతైన ప్రస్తుత స్థితిలో నైతిక విజయం కబుర్లు మాని నైతిక బాధ్యత వహించి తన పదవికి వీర్రాజు రాజీనామా చేస్తే హుందాగా ఉంటుంది. అంతేగాని ఇలా చౌకబారు విమర్శలు చేసి జనంలో పార్టీ ఇమేజ్‌ను, తన పరువును బజారున పడేసుకోవడం ఎందుకు? ఉట్టిని అందుకోలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు  భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో హుజూరాబాద్‌ లాంటి ఫలితాలు చూపిస్తామని ప్రగల్బాలు ఒకటి! ఒకపక్క ఎమ్మెల్యీ పదవీకాలం పూర్తి కావస్తుండడం, మరోపక్క ఘోర ఓటమితో తన సీటుకు ఎసరు వస్తుందని భయపడి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని జనం అనుకుంటే అది వారి తప్పు కాదు. మీ గొప్పతనమే!