iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి పదవి తరువాత సంగతి కానీ ముందు అధ్యక్ష పదవి ఇవ్వొచ్చుగా వీర్రాజు గారు…

  • Published Feb 05, 2021 | 3:18 AM Updated Updated Feb 05, 2021 | 3:18 AM
ముఖ్యమంత్రి పదవి తరువాత సంగతి కానీ ముందు అధ్యక్ష పదవి ఇవ్వొచ్చుగా వీర్రాజు గారు…

ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అని ఆంద్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సోము వీర్రాజు లాంటి వాళ్ళను చూసి అనుంటారు. ఇంకో మాట కూడ ఉంది తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట…సోము వీర్రాజు దూకుడుగా రాజకీయం చేస్తాడన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో ఉన్నది,అది నిజం కూడా. ఉమ్మడి రాష్టంలో కానీ ,విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వారిలో వీర్రాజుదే కాస్త గట్టిస్వరం. అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత బాధ్యతల వలన పెరిగిన ఒత్తిడి వలనో లేక పోరుగు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పోటీ పడాలనుకుంటున్నారో కానీ నింగికి నిచ్చెన వేసినట్లు మాట్లాడుతున్నాడు.

బీజేపీ-జనసేన కూటమి తరుపున బిసి ముఖ్యమంత్రి ….

నిన్న గుంటూరు జిల్లాలో ఒక మండల స్థాయి బిసి నాయకుడు సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరాడు.ఆ సభలో వీర్రాజు పట్టరాని ఆవేశంతో మాట్లాడారు. బీజేపీ-జనసేన తరుపున బిసి నేతను ముఖ్యమంత్రిని చేస్తాం ,చంద్రబాబు ,జగన్ లకు ఆ ధైర్యం ఉందా? అంటూ సవాల్ విసిరాడు. అందుకే అన్నది ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని..

తిరుపతి ఉప ఎన్నికల్లో మేమంటే మేము పోటీచేస్తామని బీజేపీ,జనసేన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కూటమి తరుపున ఎవరు పోటీ చేయాలన్నదాని మీద ఇప్పటి వరకు ఒక అంగీకారానికి రాలేకపోయారు .అలాంటిది సోము వీర్రాజు కూటమి తరుపున ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి మీద ప్రకటనలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది.సోము వీర్రాజు ప్రకటన మీద జన సేన వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి.బిసి ముఖ్యమంత్రి పేరుతొ ముందరికాళ్లకు బంధాలు వేశాడని , బిసిలను కాదనలేము,పవన్ ను వదలలేము అని జన సేన వర్గాలు బాధ వ్యక్తం చేస్తున్నాయి.

Also Read:పాపం బేబీ నాయిన…!!చిన్నోడిపైనే “లోకల్” భారమంతా

ఇలాంటి ప్రకటనలు చేసే ముందు ఒకింత ఆలోచించాలి. జాతీయ పార్టీల తరుపున ముఖ్యమంత్రుల ఎంపిక అధిష్టానం చేస్తుంది. రాష్ట్ర పార్టీ పాత్రం చాలా పరిమితం.ఏదైనా సందర్భంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయం తీసుకోవాల్సి వచ్చినా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాన కార్యదర్సులో ,ప్రత్యేక ప్రతినిధుల్లో నేరుగా రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడతారు. ఈ మొత్తం ప్రక్రియలో సోము వీర్రాజు లాంటి అధ్యక్షులది చాలా పరిమిత పాత్రనే.

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందస్తుగా ప్రకటిస్తుందా? 

ఎన్నికల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం బీజేపీలో లేదు. గతంలో గెలిచిన మహారాష్ట్ర,హర్యానా,అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తరువాతనే బీజేపీ ముఖ్యమంత్రిని ఎంపికచేసింది. పలుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజే సింధియా,శివాజీరాజ్ సింగ్ చౌహన్ లాంటి సీనియర్ నేతల విషయంలో కూడా ఎన్నికలకు ముందు బీజేపీ ఎలాంటి అధికార ప్రకటన చేయదు. అలాంటి పార్టీ తరుపున సోము వీర్రాజు బిసి ముఖ్యమంత్రి అనటం పొలిటికల్ స్టెంట్ మాత్రమే . ఆయన మాటకు ఎన్నికల నాటికి ఏ మాత్రం విలువ ఉండదు . షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరిగితే సోము వీర్రాజు పదవి కాలం కూడా ముగుస్తుంది.

ముందు బిసి నేతను అధ్యక్షుడు చేయొచ్చుగా?

మూడేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల్లో గెలిచిన తరువాత జరిగే ముఖ్యమంత్రి పదవి మీద ఇప్పుడే సవాళ్లు విసిరే బదులు తమచేతిలో ఉన్న రాష్ట్ర అధ్యక్ష పదవికి బిసి నేతను ఎంపిక చెయ్యొచ్చు కదా? అన్న ప్రశ్న సోము వీర్రాజుకు ఎదురుకాక తప్పదు. అధిష్టాన నిర్ణయంలాంటి దాటవేత సమాధానాలతో ఉపయోగం ఉండదు.

గతాన్ని పరిశీలిస్తే ఉమ్మడి రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ,ఆలే నరేంద్ర లాంటి బీసీ నేతలు నాయకత్వం వహించారు కానీ ఆంధ్రప్రాంతం నుంచి వి.రామారావ్,చిలకం రాంచంద్రారెడ్డి,కంభంపాటి హరిబాబు,కన్నా లక్ష్మీనారాయణ తదితరులు బీజేపీ రాష్ట్ర అద్యక్షులయ్యారు కానీ బిసి నేతలకు అవకాశం రాలేదు.

ప్రాంతీయ పార్టీల తరుపున ఎవరు ముఖ్యమంత్రులు అవుతారు? .

ప్రాంతీయపార్టీలు తరుపున ఆ పార్టీ వ్యవస్థాపకులో, వారి వారసులో కాకుండా ఇతరులు ముఖ్యమంత్రులు అయిన సందర్భాలున్నాయా?. మీ పార్టీ తరుపున బిసిని ముఖ్యమంత్రిని చేస్తారా లాంటి సవాళ్లు ఏ మాత్రం ప్రాతిపదిక లేనివి. వారసత్వ రాజకీయాలు పారదోలుతాం లాంటి మాటలకు కూడా పెద్దగా విలువ లేదు.

Also Read:అందుకే ఏపీకి అంతటి ప్ర‌త్యేక‌త‌..!

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో,కేంద్రంలో ఎంతమంది నేతల వారసులు మంత్రులు అయ్యింది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకా ఎమ్మెల్యే,ఎంపీలయిన వారసులకు లెక్కలేదు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను నిరసించిన తెలుగుదేశం,సమాజ్ వాది ,ఆర్జేడీ ,శివసేన,డీఎంకే అన్ని రెండో జనరేషన్ వారసుల నాయకత్వంలో ఉన్నాయి. బీజేపీ తరుపున సీనియర్ నేతల వారసులు మంత్రులయ్యారు . మరో 10,15 ఏళ్లలో ముఖ్యమంత్రులు కూడా కావచ్చు… వారసత్వ రాజకీయాలు మీద మాట్లాడే నైతిక హక్కు నిజానికి ఏ పార్టీకి మిగల్లేదు.

సరే,రాజకీయ నాయకులు ఎదో ఒక సవాల్ విసురుతుంటారు కానీ సోము వీర్రాజు కు బిసి ల మీద ఇంత అకస్మాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో బీజేపీ శ్రేణులకు కూడా అర్ధం కాని ప్రశ్న . గోదావరి జిల్లాలో బలంగా ఉన్న రెండు కులాలు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 3 శాతం ఓట్లున్న మరో రెండు కులాల కేంద్రంగా బీజేపీ ఆంధ్రాలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది . సోము వీర్రాజు బిసి జపం ఎందుకు చేస్తున్నట్లు?

కదిలిన టీడీపీ పునాది….

2019 ఎన్నికలకు ముందు బిసిలలో ఎక్కువ శాతం మద్దతు టీడీపీకే అని ఆ పార్టీ చెప్పుకునేది. బిసి లలోని రెండు కులాలు టీడీపీకే మొదటి నుంచి అండగా నిలిచాయి. కానీ 2019లో బిసి లు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు ఆచంట,తణుకు లాంటి గోదావరి జిల్లాలకు చెందిన నియోజకవర్గాలతో పాటు విజయనగరం, అనంతపురం( హిందూపూర్,ఉరవకొండ తప్ప),కర్నూల్ జిల్లాలో వైసీపీ స్వీప్ చేయటాన్ని బట్టి తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో టీడీపీ తరుపున ఒక్క బిసి అభ్యర్థి గెలవకపోవటం ఆపార్టీకి బిసిలు ఎంత దూరమయ్యారో తెలుపుతుంది.

తొలిసారి రాజ్యసభ ప్రాతినిధ్యం…

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్ర బోస్,మోపిదేవి రమణలను జగన్ మోహన్ రెడ్డి మంత్రులను చేశాడు ,తదుపరి ఎమ్మెల్సీ లను చేశాడు. శాసనమండలి రద్దు బిల్లు ప్రవేశ పెట్టిన తరువాత జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణలను రాజ్యసభకు ఎంపిక చేసి బిసి హృదయాలను గెలుచుకున్నారు.

గడచిన 40 ఏళ్లలో శెట్టి బలిజ ,మత్స్యకార వర్గాల నుంచి రాజ్యసభకు ఎన్నికయిన తొలి నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకట రమణ .టీడీపీ తమది బిసిల పార్టీ అని ఎంత చెప్పుకున్నా పిల్లి సుభాష్ ,మోపిదేవి రమణ లాంటి నేతలకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యత ఆయా వర్గాలలో వైసీపీ పట్ల సానుకూలత పెంచుతుంది. ఇంక సోము వీర్రాజు లాంటి నేతలు బిసిని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ సవాల్ విసిరినా,తాము అధికారములోకి వస్తే బిసి ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఆ వర్గాలు నమ్మవు.

Also Read:ఆంధ్రుల హక్కుగా సాధించిన విశాఖ ఉక్కు ఇప్పుడు చేజారుతున్నట్టేనా?

నెల్లూరు టౌన్,కనిగిరి లాంటి నియోజకవర్గాల నుంచి గతంలో ఏ పార్టీ తరుపున కూడా బిసిలు ఎమ్మెల్యేలు అయ్యింది లేదు.ఆ నియోజకవర్గాల నుంచి వైసీపీ తరుపున బిసి నేతలు అనిల్ యాదవ్,బుర్రా మధుసూదన్ ఎమ్మెల్యేలయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ కు అత్యంతముఖ్యమైన నీటి పారుదల శాఖతో పటు ,కర్నూల్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా కీలకమైన బాధ్యతలు ఇచ్చారు.ధర్మాన కృష్ణ దాస్ ,అప్పలరాజు,బొత్స సత్యనారాయణ,చెల్లబోయిన వేణు,అనిల్ కుమార్ యాదవ్,శంకర్ నారాయణ,గుమ్మా జయరాములు మొత్తం ఏడుమంది కీలక శాఖా మంత్రులు జగన్ క్యాబినెట్ లు ఉన్నారు.

అప్పలరాజు ది గ్రేట్
మా చిన్నతనములో కాయకూరలు తెలియవు. మాకు కూరంటే చేపల కూరే . తండ్రి,బాబాయిలు చేపలవేట నుంచి ఏ అర్ధరాత్రి తిరిగొచ్చినా అమ్మ నిలువ ఉన్న చింతపులుసుతో చేపల కూరే చేసిపెట్టేదని తన బాల్యాన్ని తలుచుకునే నికార్సైన బిసి, మత్సకార వర్గానికి చెందిన విద్యావంతుడు,వందల ప్రాణాలు కాపాడిన డాక్టర్ సీదిరి అప్పలరాజు మంత్రి అయ్యింది జగన్ మంత్రి వర్గంలో.. అదే వర్గానికి చెందిన మోపిదేవిని రాజ్యసభకు పంపారు కాబట్టి మరో కులానికి మంత్రి పదవి ఇచ్చినా జగన్ ను ఎవరైనా నిలదీస్తారా? . చంద్రబాబు స్టయిల్లో రాజ్యసభకు ఎన్నికయినందుకు సన్మానం పేరుతో మోపిదేవిని మత్స్యకార గ్రామాలలో తిప్పి మనకు న్యాయం చేసారని చెప్పి ఉండొచ్చు కానీ వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలన్న తలంపుతో సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చారు.. ముఖ్యమంత్రినన్న భేషజం లేకుండా అందరి ముందు అప్పలరాజు దీ గ్రేట్ అంటూ సంబోధించటం జగన్ కే చెల్లింది..

స్థూలంగా మాటలు కాదు చేతలు కావాలి. ఏ పార్టీ/ఏ ప్రభుత్వం తమకేమి చేసిందో లబ్ధిదారులకు, సంబంధిత వర్గాలకు మరొకరు చెప్పవలసిన అవసరం లేదు…