ప్రాణాలు తీసేసే జిల్లా వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ , వాళ్లకి ప్రాణాలు తీయడం తప్ప ఏమీరాదు : కడపకు ఎయిర్పోర్ట్ ను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు .
ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనటం రాజకీయ నాయకులకు పరిపాటే అయినా పదే పదే అదే తీరు ప్రత్యేకంగా ఒక ప్రాంతం పై ఎక్కువగా చూపించటం , అవకాశం చిక్కినప్పుడల్లా విద్వేషం చిమ్మడం మాత్రం కడప పైనే జరుగుతుంది . ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు . పలుపార్టీల నాయకులు కడప పై , సీమ పై ఈ తరహా విషంకక్కడం ఈ మధ్య పెరిగింది కానీ ఈ విష ప్రచారానికి అంకురార్పణ చేసింది , అనుకూల మీడియా ద్వారా తీవ్ర ప్రచారం చేయించింది బాబేనని చెప్పొచ్చు .
Also Read:ఆ బ్లడ్, ఆ బ్రీడ్ నోరు విప్పలేదే!?
దివంగత వైఎస్సార్ ని ఎదుర్కోవటానికి కడప అంటే బాంబుల సంస్కృతి అని , గుండాయిజం , ఫ్యాక్షనిజం పేరిట హత్యలు చేసుకొనే ప్రాంతం అని ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విపరీతమైన దుష్ప్రచారం చేసి జనంలో ఆ ప్రాంతం పట్ల అపోహలు , భయాలు పెంచే ప్రయత్నం చేశాడు . ఓ వైపు కడపకు నీళ్లిచ్చాను నాకు ఓటు వేయండి అని కడపలో ప్రాథేయపడే బాబు,విజయవాడ రాగానే కడప రౌడీయిజం , గుండాయిజం చూపిస్తే తోకలు కత్తిరిస్తా అంటూ రెండు కళ్ళ సిద్ధాంతం చూపేవారు .
తర్వాతి కాలంలో ఇతర పార్టీల నాయకులు కూడా ఇదే ధోరణి అవలంభించడం దురదృష్టకరం .
సీమ గుండాయిజం చూపిస్తే ఉరికించి కొడతా అని వైజాగ్ లో ఊగిపోయారు జనసేనాని పవన్ కళ్యాణ్ . కృష్ణా జిల్లాకు రాగానే పులివెందుల రౌడీయిజం చూపిస్తే తాట తీస్తా , కడప సంస్కృతి గోదావరి జిల్లాలకు తేవాలనుకొంటే తోలు వలుస్తా అంటూ కడప పై , సీమ పై విషం చిమ్ముతూ పలు ప్రసంగాలు చేశారు . అదే కడపలో ప్రచారానికి వెళ్ళినప్పుడు రాయలసీమ కళల కాణాచి అని , ఇక్కడి పిల్లలు కళామతల్లి ముద్దుబిడ్డలు అని చంకనెత్తుకొని వీరి కోసం రైల్వే కోడూరులో అతి పెద్ద గ్రంథాలయం కడతానని వాగ్దానం ఇచ్చి కడప దాటగానే ఆ వాగ్దానాన్ని గాలికొదిలేసి మళ్లీ కడప పై ద్వేషం చిమ్మారు .
Also Read:ఏపీకి “కొత్త” కళ.. ఆసక్తికర అంశాలు..!
వీరి తర్వాత ఇప్పుడు బిజెపి నాయకుల వంతు వచ్చింది .ఇటీవల కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల్లో తమను గెలిపిస్తే విపరీతమైన అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టిన బిజెపి నాయకులు కడప ప్రజల మానసచోరుల అవతారం ఎత్తి కడప కారందోసెలు తిని , సీమ యాసలో మాట్లాడే ప్రయత్నం చేసి కడప ప్రజలను ఆకట్టుకోవడానికి పడ్డ పాట్లు అక్కడి జనాలు ఇంకా మరిచిపోక ముందే కడప పై కడివెడు విషంకక్కారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు .
ప్రాణాలు తీసే కడప జిల్లా వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఎందుకు , వాళ్ళకి ప్రాణాలు తీయడం తప్ప ఏమీ రాదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి . నిజంగా మేము హత్యలు చేసేవాళ్ళం అయితే ఇంతమంది మా ప్రాంతాన్ని ఇలా కించపరిచి మళ్లీ ఇక్కడికొచ్చి ఓట్ల కోసం కపట ప్రేమలు చూపిస్తూ తిరగగలిగే వారా అనే కడప వాసుల ప్రశ్నలకు వీరి దగ్గర్నుండీ సమాధానం మాత్రం లేదు .
Also Read:ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అస్తమయం
నిజానికి వీళ్ళ సమస్య కడప కాదు . అక్కడి నాయకులను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ ప్రాంతం పై విద్వేషం చిమ్మడం వీళ్ళ నైజం అయిపోయింది . కడప పై వ్యతిరేకత వీళ్ళ నరనరాల్లో జీర్ణించుకుపోయింది . కడప పై , సీమ సంస్కృతి పై ఇతర ప్రాంతాల ప్రజల్లో అపోహలు తొలగినా వీళ్ళ బుద్ది మాత్రం మారలేదు . వీరి పైత్యానికి కాలమే మందు వేయాలి .