ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఇటీవల పదే పదే వివాదాల్లో తలదూరుస్తున్నారు. తన స్థాయికి తగని మాటలతో కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు. పైగా తీవ్రమైన విమర్శల తర్వాత వాటిపై వివరణ ఇచ్చేసమయంలో కూడా ధోరణి మార్చుకోవడానికి సిద్డపడడం లేదు. దాంతో సోము వీర్రాజు వ్యూహాత్మకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిత్యం వార్తల్లో ఉండాలనే లక్ష్యం ఆయనకుందా అనే అనుమానం కలుగుతోంది. అదేసమయంలో కొత్త కొత్త వివాదాలు సృష్టించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనే అంచనాతో ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అదే సమయంలో ఉత్తరాదికి చెందిన బీజేపీ నేతలను ఆయన అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ప్రజల దృష్టిని తనవైపు మళ్లించుకునే యత్నం సాగిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది.
బీజేపీ ప్రచార సభలో చీప్ లిక్కర్ చౌకగా అందిస్తామని ఆయన వాగ్దానం చేశారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన చీప్ లిక్కర్ ఇస్తామని కూడా చెప్పేందుకు ఆయన సందేహించలేదు. తద్వారా ఆ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. తాను మాత్రం ప్రజల ఆరోగ్యం. ఆర్థిక పరిస్థితులను గమనంలో ఉంచుకునే ఈ వాగ్దానం చేసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ నేతలు ఎవరూ దానిని తప్పుబట్టలేదు. మందు అందుబాటులో ఉంచుతామని, చవగ్గా ఇస్తామనే హామీలు ఇచ్చేందుకు కూడా పార్టీ దిగజారిపోయిన తీరు తగదని చెప్పలేదు. దాంతో ఇదంతా బీజేపీ ప్రణాళికగానే పలువురు భావించాల్సి వస్తోంది.
ఆ సందర్భంగా సాగిన చర్చను దృష్టిలో పెట్టుకున్న సోము వీర్రాజు మరింత చెలరేగిపోతున్నారు. ఆ సమయంలో తాను కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడినని కూడా మరచిపోతున్నారు. రాజకీయ నేతలంతా దొంగ లం. కొడుకులంటూ ఆయన బహిరంగసభలో వ్యాఖ్యానించడం ఆయన కుసంస్కారానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఆయన కూడా రాజకీయ నాయకుడే, ఆయనో రాజకీయ పార్టీలో ఉన్నాననే విషయం కూడా ఆయనకు పట్టలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. ఇలాంటి మాటలతో నలుగురి నోళ్లలో నిత్యం నానాలని ఆయన ఆశిస్తే అంతకుమించన పనికిమాలిన తనం ఉండదని చెప్పవచ్చు.
Also Read : కడప ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు
రాయలసీమ, కడప, కర్నూలు గురించి చేసిన నీచమైన వ్యాఖ్యలు కూడా అదే రీతిలో ఉన్నాయి. పైగా వివరణలో తన వ్యాఖ్యలను వక్రీకరించారనే పాత చింతకాయపచ్చడి కామెంట్ ఒకటి. ఈ సోము వీర్రాజు మాటలను బీజేపీ నేతలెవరూ తప్పుబట్టకపోవడం, కనీసం ఉపసంహరించుకోవాలని కూడా కోరకపోవడం గమనిస్తుంటే బీజేపీ పథకంలో భాగంగానే ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలకు ప్రయత్నిస్తున్నారా అనే సందేహాలు కలుగుతాయి. పైగా తాము సంస్కృతి ఉద్దారకులమనే చెప్పుకుంటూ ఇలాంటి కుహానా సంస్కృతి ప్రదర్శనలు ఏమిటా అని ప్రశ్నించేందుకు వారి మిత్రపక్షం జనసేన కూడా సిద్ధంగా లేకపోవడం చూస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను కించపరచడానికి సైతం వెనుకాడబోమని బీజేపీ చాటుకుంటున్నట్టుగా ఉంది.
కొద్దిరోజుల క్రితం బీజేపీ వీర్రాజు అల్లుడి మీద కేసు నమోదయ్యింది. విషయమేమిటో తెలుసా… వేరెవరో ఆస్తిని తన సొంతదిగా తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులో ఏడు కోట్లకు పైగా రుణం తీసుకుని ఎగ్గొట్టేశారని అభియోగం మీద. అంటే ప్రజల ధనం దర్జాగా దొంగ పట్టాలు చూపించి దోచుకున్న సొంత అల్లుడిని నియంత్రించలేని సోము వీర్రాజు నిత్యం ఎదుటివారి మీద నోరుపారేసుకోవడం విడ్డూరంగా ఉంటుంది. అంతేగాదు గతంలో రాజమండ్రిలో అమిత్ షా సభ సందర్భంగా వివిధ సంస్థల నుంచి సోము వీర్రాజు కోట్లాది రూపాయలు ఫండ్స్ గా వసూలు చేసుకున్నారని స్వయంగా ఆయన సొంత పార్టీ నేతలే ఆరోపించారు వారి పార్టీలో దాని మీద చర్చ జరిగి, విచారణ కూడా చేశారు. అప్పట్లో టీడీపీతో కలిసి అధికారం పంచుకున్న సమయంలో అడ్డగోలుగా ఇలాంటి దందాలు సాగించిన సోము వీర్రాజు ఒక ప్రాంతం మీద పచ్చిగా దాడి చేసే ప్రయత్నం చేయడం, దానిని రాజకీయ అవసరాలతో ఇతర బీజేపీ నేతలు ఖండించలేకపోవడం చూస్తుంటే బీజేపీ ధోరణి తేటతెల్లమవుతోంది.
ఉత్తరాదిలో పలువురు బీజేపీ నేతలు ఇదే పంథా అవలంభిస్తారు. వార్తల్లో ఉండేందుకు ఏదోకటి చేస్తుంటారు. అదే సమయంలో విద్వేషాలు రగల్చడంలో వారిది అందెవేసిన చేయిగా వ్యవహరిస్తారు. మత విద్వేషాల సహాయంతో మెజార్టీని తమ వైపు మళ్లించుకునే క్రమంలో నిత్యం విషపు కూతలతో ప్రజలను పక్కదారి పట్టిస్తారు. ఇదంతా వారి వ్యూహాత్మక విధానం. ఇప్పుడు ఏపీ బీజేపీ దానిని వంటబట్టించుకునే యత్నంలో ఉంది. అందులో ముందుండాలని సోము వీర్రాజు తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది.
Also Read : కడుపులో కత్తులు , కళ్ళలో ప్రేమలు -కడపపై ఆ నాయకుల తీరు