Idream media
Idream media
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా మొదటి నుంచీ అడుగులు వేస్తున్నారు. బాధ్యతలు చేపట్టక ముందే ప్రముఖులను కలుస్తూ రాజకీయంగా అందరి దృష్టినీ ఆకర్షించిన సోము బాధ్యతలు చేపట్టాక దూకుడు పెంచారు.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేడర్ ను లక్ష్యంగా చేసుకుని క్షేత్ర స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ ప్రముఖులతో భేటీ అయిన సోము ఇప్పుడు జిల్లా, పట్టణ, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆడియో, వీడియో కాన్షరెన్స్ ల కేడర్ తో మాట్లాడుతూ పలు సూచనలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను జనాలకు వివరిస్తూ బీజేపీ బలోపేతానికి పాటుపడాలని వారికి వివరిస్తున్నారు.
జనసైనికులను కలుపుకోండి
రోజూ ఏదో ప్రాంతానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో సోము వీర్రాజు పార్టీకి సంబంధించిన విషయాలపై మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పట్టుసాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి టీడీపీ కేడర్ ను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఏపీ యువతలో పవన్ కల్యాణ్ అంటే కొంత క్రేజ్ ఉంది. ఇప్పటికే బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులను, జనసైనికులను కలుపుకుంటే స్థానికంగా బలోపేతం కావచ్చని ఆయన పార్టీ కేడర్ కు సూచిస్తున్నారు.
గతంలో టీడీపీకి సపోర్ట్ చేసిన చాలా మంది అనంతరం జనసేనకు మద్దతు తెలుపుతున్నారు. వారందరితో కలిసి పనిచేస్తే ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని సోము భావిస్తున్నారు. లోకల్ గా అవసరమైతే జనసైనికులతో సంప్రదింపులు జరపాలని, ఇందుకు పవన్ ప్రకటనలను వారి దృష్టికి తీసుకెళ్లాలని సోము వారికి సూచిస్తున్నట్లు తెలిసింది.