Idream media
Idream media
మిగతా మీడియాల సంగతి ఎలాగున్నా.. సోషల్ మీడియా మాత్రం ప్రతీ దాన్ని ఓ కంట కనిపెడుతోంది. ప్రధానంగా పొలిటికల్ పార్టీల తీరుతెన్నులను నిశితంగా గమనిస్తున్న నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా లోపాలను, నేతల నిర్ణయాలను ఎండగడుతున్నారు. అన్ని పార్టీలకూ ఈ సెగ తాకుతున్నా ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి కాస్త ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే.. ఆ పార్టీ గతంలో అధికారంలో ఉండడం, ఆ సందర్భంలో తీసుకున్న నిర్ణయాలను మరిచి కొన్ని అంశాల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడమే ఇందుకు కారణంగా మారింది.
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాలంటే.. జగన్ దిగిపోవాలట..! తెలుగుదేశం పార్టీ ఏపీలో చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో కనిపిస్తున్న పోస్టర్ ఇది. ఇది చదివిన వారు ఎవరికైనా ఇట్టే నవ్వొస్తుంది. ఎందుకంటే.. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేది రాష్ట్ర ప్రభుత్వం కాదని, అది కేంద్ర పరిధిలోని అంశమని అందరికీ తెలుసుకాబట్టి. పోనీ వారి ఉద్దేశం రాష్ట్రం విధించే వ్యాట్ ను తగ్గించడం అయినా కానీ.. అసలు ఆ వ్యాట్ ను పెంచింది ఎవరనేదే ఇప్పటి ప్రశ్న. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ను పెంచింది 2015లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడే.
ఇప్పుడు ఆ వ్యాట్ ను తగ్గించాలని తెలుగుదేశం రాష్ట్రమంతటా నిరసనలు చేస్తోంది. ప్రజలపై అధిక ప్రభావం చూపే పెట్రో ఉత్పత్తుల ధరలపై ఆందోళనలు చేయడమనేది కలిసొచ్చే అంశమే కానీ.. పోరాడాల్సింది ఎవరి పైనా, డిమాండ్ చేయాల్సింది ఎవరిని అనేదే ఇప్పుడు ప్రశ్న. పైగా తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యాట్ ను పెంచి, ధరల పెంపుతో సంబంధం లేని వైసీపీ కి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపైనే సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. తాను సీఎంగా ఉండగా వ్యాట్ పెంచలేదు అని చంద్రబాబు చెప్పే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున.. ప్రజల పక్షాల మాట్లాడుతున్నట్లు పెట్రోల్ ధర తగ్గించాలి అని డిమాండ్ చేస్తున్నా.. అప్పుడు మీరేం చేసింది ఏంటనే ప్రశ్నలు తెలుగుదేశానికి ఎదురవుతున్నాయి.
ధరలు పెరుగుతూ పోయినప్పుడు చంద్రబాబు కేంద్రంలోని బీజేపీని ఏమీ అనకుండా.. తగ్గినప్పడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి భయపడి.. చంద్రబాబు రెండు నాల్కల్లో ఒకటి చప్పబడిందా? అంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధర ఇప్పడు దేశమంతా ఉన్న సమస్య. ఎవరూ ఊహించనంతగా పెరిగిన ధరలు సామాన్యుడిని కుదేలు చేస్తున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి బతుకు భారం అవుతోంది. దీనిపై ఆలస్యంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు అంటూ భారాన్ని రాష్ట్రాలపై నెట్టేస్తోంది. దీన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.