iDreamPost
iDreamPost
ఎప్పుడో ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన రామ్ రెడ్ వచ్చే జనవరికి రిలీజ్ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికైతే సంక్రాంతి అని పబ్లిసిటీ చేస్తున్నారు కానీ అప్పటికి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. దీని సంగతలా ఉంచితే రామ్ నెక్స్ట్ మూవీ ఏదనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ ఉండొచ్చనే టాక్ వినపడుతోంది కానీ అది నిజమయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇంకొంత కాలం కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి ఆలోగా ఈ కాంబోలో స్రవంతి రవికిశోర్ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.
కానీ రామ్ మాత్రం స్వయంగా ఏదీ చెప్పడం లేదు. కొత్తగా మేకోవర్ చేసుకుని కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వదిలడం తప్ప ఇంకే అప్డేట్ లేదు. ఒకవేళ త్రివిక్రమ్ తో కనక సినిమా చేస్తే అంతకన్నా గోల్డెన్ ఛాన్స్ మరొకటి ఉండదు. అల వైకుంఠ పురములో ఇండస్ట్రీ హిట్ దెబ్బకు మాములుగానే డిమాండ్ ఓ రేంజ్ లో ఉండే త్రివిక్రమ్ మార్కెట్ అమాంతం రెట్టింపయ్యింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. ఈ కాంబో కుదిరితే ఖచ్చితంగా మంచి క్రేజ్ వస్తుంది. కానీ ఆర్ఆర్ఆర్ స్టేటస్ లో క్లారిటీ లేకపోవడం వల్ల ప్రస్తుతానికి దీన్ని ఊహాగానంగానే భావించాలి.
ఇక రామ్ ఎదురుచూపులు రెడ్ మీదే ఉన్నాయి. మొదటిసారి డ్యూయల్ రోల్ చేయడంతో పాటు క్లాస్ మాస్ కు నచ్చే అన్ని అంశాలు ఉన్న సినిమా కావడంతో ఇస్మార్ట్ శంకర్ ట్రాక్ రికార్డుని కొనసాగిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. తమిళంలో భారీ హిట్టు కొట్టిన తడం రీమేక్ గా రూపొందిన రెడ్ మీద అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. సంక్రాంతి బరిలో దిగడానికి గట్టిగానే ప్లాన్ చేసుకుంది. తనకొచ్చిన మాస్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని రామ్ సబ్జెక్టు సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తొందరపకుండా నిదానమే ప్రదానం సూత్రాన్ని పాటిస్తున్నాడు.