iDreamPost
iDreamPost
ఏపీ ముఖ్యమంత్రికి అరుదైన గుర్తింపు దక్కింది. పాలనాపరంగా ఏపీని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ప్రమాణ స్వీకారంనాడు చెప్పిన మాటలను సీఎం జగన్ చేసి చూపించారు. పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఎన్నికయ్యింది. సీఎం ఆఫ్ ది ఇయర్ గా వైఎస్ జగన్ ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న పాలనా విధానంపై ఏడాది పాటు పరిశీలన చేసి ఎంపిక చేసినట్టు స్కోచ్ గ్రూప్ ప్రకటించింది. ఆ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్ స్వయంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కి ఈ అవార్డ్ అందించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాలనపై అధ్యయనం సాగిందని స్కోచ్ ప్రకటించింది. దేశఃలోనే అత్యున్నత సీఎంగా జగన్ ఎంపిక కావడం విశేషంగా చెబుతోంది.
అవార్డ్ కి సంబంధించిన వివరాలను సమీర్ కొచ్చర్ వెల్లడించారు. , “వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతుల పంటలకు గిట్టుబాటు ధరలకు భరోసా కల్పించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇది రైతులకు మేలు చేస్తున్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. మధ్య వయస్కులైన మహిళలకు ఆర్థిక సాధికారిత కల్పించే వైఎస్ఆర్ చేయూత పథకం ప్రయోజనకరంగా ఉందన్నారు. మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేలా నాలుగేళ్ల పాటు ఈ పథకాన్ని రూపొందించడం మేలు చేస్తోందన్నారు. మహిళలకు రక్షణగా రూపొందించిన దిశ చట్టం ద్వారా గణనీయమైన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. అభయ్ వంటి పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించేందుకు దోహదపడుతోందన్నారు.
అన్నింటికీ మించి ఏపీలో కోవిడ్ సమయంలో చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. ముందుచూపుతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ప్రజలకు వైద్యం , సంక్షేమం అందించడానికి ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 123 పథకాలను పరిశీలించి, ఈ ఎంపిక చేసినట్టు వివరించారు. “పాలనను మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా మార్చడానికి గత రెండేళ్లలో అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. వివిధ రంగాలలో సమూల మార్పులు తెచ్చారు. ఇది ముఖ్యమంత్రి జగన్ ఘనతగా చెప్పాలి. ఇటువంటి సమర్థపూరితంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయి. ”అని కొచ్చర్ అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్ ఇప్పటికే వివిధ సంస్థల రేటింగ్స్ లో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం స్కోచ్ సంస్థ ప్రకటించిన ఉత్తమ ముఖ్యమంత్రి గుర్తింపు ఆయనకు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలోనూ అందులోనూ ఆర్థికంగా పలు చిక్కులున్న సమయంలో ముఖ్యమంత్రి చొరవ రాష్ట్రానికి మేలు చేస్తుందనడానికి తాజా అవార్డు ఓ ఉదాహరణగా పేర్కొంటున్నారు. పలువురు నేతలు సీఎంని అభినందించారు. .
2003 నుంచి దేశంలో స్కోచ్ అవార్డులను అందిస్తున్నారు. పాలనా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టిన వారికి ఈ గుర్తింపు దక్కుతుంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డ్ ప్రకటించారు. సామాజిక మార్పులతో ప్రజలకు ప్రయోజనం కలిగించే వారికి గుర్తింపుగా స్కోచ్ గ్రూప్ ఈ అవార్డ్ ప్రకటిస్తుంది. 1997లో ప్రారంభించిన స్కోచ్ సామాజిక అంశాలపై అధ్యయనం చేస్తుంది. సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా స్కోచ్ అధ్యయన బృందం వివిధ సంస్థలకు నివేదికలు అందిస్తుంది. కాగా గత సంవత్సరమే ముఖ్యమంత్రి జగన్ కు స్కోచ్ గ్రూప్ సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించగా ఆ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్ స్వయంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కి ఈ అవార్డును మంగళవారం అందించారు.