iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి మ‌ర్డ‌ర్ కు స్కెచ్..!

ముఖ్యమంత్రి మ‌ర్డ‌ర్ కు స్కెచ్..!

ఓ లేఖ ఆ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. మొత్తం యంత్రాంగాన్ని ఉరుకులు, పెరుగులు పెట్టించింది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను సైతం అల‌ర్ట్ చేసింది. ముఖ్య‌మంత్రిని చంప‌బోతున్న‌ట్టు ఆ లేఖ‌లో పేర్కొన‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు హత్య బెదిరింపు లేఖ చేరింది. ఆయన నివాస కార్యాలయానికి(నవీన్‌ నివాస్‌) గురువారం వచ్చిన ఈ లేఖలో హత్యకు వ్యూహరచన పూర్తి అయినట్లు పేర్కొన్నారు. కిరాయి హంతకులు సిద్ధం అయ్యారని.. అత్యాధునిక అస్త్రాలతో హత్యల్లో ఆరితేరిన వర్గం నగరంలో నవీన్‌ ప్రతి అడుగులో అడుగు వేస్తుందని ప్రధానాంశం. ప్రధాన వ్యూహకర్త నాగ్‌పూర్‌లో ఉంటున్నాడని, మారణాస్త్రాలు రాష్ట్రానికి చేరాయని ఇంగ్లీషులో చేతిరాత లేఖ వచ్చింది. పలు రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు కలిగిన వాహనాలతో హంతకులు నగరంలోకి చొరబడ్డారని, ముఖ్యమంత్రి ప్రతి అడుగుని అనుక్షణం పసిగుడుతున్నారని ఉంది. ఇటువంటివి 17 వాహనాల్లో నగరంలో నవీన్‌ పట్నాయక్‌ను అనుసరిస్తూ తిరుగాడుతున్నాయని, వీటిలో 2 ఒడిశా రిజిస్ట్రేషన్‌ వాహనాలు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ అనుబంధ అధికార వర్గాలకు అలర్ట్‌ జారీ చేసింది. దీంతో నవీన్‌ నివాస్‌లో హల్‌చల్‌ పుంజుకుంది. అయితే లేఖరాసిన వ్యక్తి, వర్గం, స్థలం వగైరా సమాచారం ఏమీ లేకుండా అనామక లేఖ జారీ కావడం ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ లేఖాంశాల సత్యాసత్యాల నిర్థారణ జరగాల్సి ఉంది. కిరాయి హంతకులు సీఎం నవీన్‌ను హత్య చేస్తారని లేఖలో పేర్కొనగా.. వారి వద్ద ఏకే 47 వంటి తుపాకులు హత్యకు ప్రయోగించనున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అప్ర‌మ‌త్త‌మైన హోంశాఖ‌

సీఎం నవీన్‌ నివాస్‌కు చేరిన అనామక లేఖతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. హత్య బెదిరింపు నేపథ్యంలో భద్రతా వ్యవస్థను తక్షణమే పటిష్టపరిచింది. రాష్ట్ర హోంశాఖ నవీన్‌ నివాస్‌కు చేరిన లేఖను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)కి పంపింది. ఈ నేపథ్యంలో జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ వర్గాలను హోంశాఖ అప్రమత్తం చేసింది. తక్షణమే ముఖ్యమంత్రి భద్రత, రక్షణ ఏర్పాట్లని సమీక్షించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, ప్రయాణాల్లో భద్రతా ఏర్పాట్లని పటిష్ట పరిచాలని అందులో స్పష్టం చేసింది. ఆ లేఖ‌లో పేర్కొన్న అంశాలు వాస్త‌వ‌మా.. కాదా.. అనే దానిపై విచార‌ణ జ‌రుగుతోంది. అది అవాస్త‌వం అయిన‌ప్ప‌టికీ ముంద‌స్తుగా ముఖ్య‌మంత్రి సెక్యూరిటీని పెంచే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.