Idream media
Idream media
కరోనా మహమ్మారి ఆరోగ్య పరంగానే కాదు.. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగానూ అడ్డంకులను సృష్టిస్తోంది. పాఠశాలల ప్రారంభం, పరీక్షల నిర్వహణ అన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరగాల్సిన ఉప ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్యల రోజురోజుకు పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా వైరస్, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ఉప ఎన్నికలు సెప్టెంబర్ 7 లోగా పూర్తి చేయాల్సి ఉంది.
12 లక్షలు దాటిన కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటేశాయి. గురువారం నాటికి 12, 27, 878 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. రికవరీ రేటు పెరగడం.. మరణాల రేటు తగ్గడం. దాదాపు 8 లక్షల మంది వరకూ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ మేరకు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 42 లక్షల వరకూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో మాత్రం వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది.