iDreamPost
iDreamPost
ఆరు నెలలు అంటే ఏ ప్రభుత్వమైనా కుదురుకోవడానికి పట్టే కనీస కాలం . గడచిన ఆరునెలలలో వైసీపీ పాలనని గమనిస్తే సంక్షేమమే ప్రధానంగా , మేనిఫెస్టో అమలే అజెండాగా సాగిందని చెప్పొచ్చు . తొలి ప్రాధాన్యతగా సంక్షేమ పథకాల అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మాట తప్పకుండా అమలు చేసిన జగన్ , తర్వాతి ప్రాధాన్యతగా అభివృద్ధి , ప్రాజెక్టులు , రాజధాని వంటి అంశాల్ని చేపట్టాడు .
ప్రభుత్వం మారిన తర్వాత ఆపేసిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టుల వ్యయం తగ్గించి దాదాపు 1300 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేయటం శుభ పరిణామమే . అలాగే రాజధాని పై కూడా స్పందిస్తూ ఖజానాకు భారం కాకుండా ఆగిన నిర్మాణాల్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించడం , ఆ దిశగా చర్యలు తీసుకోవడం అభివృద్ధి ఆగిపోయింది అని విమర్శలు చేసేవాళ్ళకు సమాధానం ఇచ్చినట్టయ్యింది .
మొత్తంగా చూస్తే ఎన్నికల నాడు ఉన్న రాజకీయ పరిస్థితులే ఇప్పుడూ కనపడుతున్నాయి . ఆ రోజు టీడీపీ ప్రభుత్వం మీద పెల్లుబికిన వ్యతిరేకతతో పోలింగ్ బూత్ లో బారులు తీరిన ప్రజలకు ఈ రోజుకీ ప్రతిపక్ష టీడీపీ మీద వ్యతిరేకత తగ్గినట్టు లేదు . అత్యంత బలమైన కేడర్ ఉందని చెప్పుకొనే ఏ కార్యక్రమానికి కార్యకర్తల హాజరు లేకపోగా , ఓ మోస్తరు నాయకులు , ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం కూడా చూస్తే టీడీపీ బలపడే సూచనలు లేకపోగా మరింత పతనమయ్యే లక్షణాలే కనపడుతున్నాయి .
సోషల్ మీడియాలో ఇప్పటికీ కనపడుతున్న వ్యతిరేకత కానీ , నిన్నటికి నిన్న అమరావతి పర్యటనలో ప్రజలు నిరసన వ్యక్తం చేయడం కానీ , రాళ్లు రువ్వడం కానీ చూస్తే గత టీడీపీ ప్రభుత్వ తప్పిదాల్ని , ఆరాచకాల్ని ఇప్పుడప్పుడే మరిచిపోయేట్టు లేరు ప్రజలు .
ఇసుక సమస్య పై తప్పితే మరే సమస్య ప్రభుత్వాన్ని చికాకు పెట్టే స్థాయిలో లేక ప్రతిపక్షాలకు విమర్శించే అస్త్రాలు కూడా కరువయ్యే పరిస్థితి కల్పించాడు జగన్ అని చెప్పొచ్చు . మరోపక్క అవినీతి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించి అవినీతిలో దేశంలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని పదమూడో స్థానానికి తీసుకొచ్చి లక్ష కోట్లు అని టీడీపీ ఆరోపణ చేసింది ఇతనిపైనేనా అని జాతీయ మీడియా కూడా పునరాలోచించుకొనే దిశగా ప్రభుత్వాన్ని నడిపిన ఘనతని కూడా సొంతం చేసుకున్నాడు .
ఏదేమైనా ఆరు నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకొంటాను అని చెప్పిన జగన్ ఆ దిశగా ప్రయాణించడంలో సక్సెస్ అయ్యాడని , ప్రజల్లో తనదైన ముద్ర వేస్తున్నాడని చెప్పొచ్చు .
అవును ఆర్నెళ్లల్లో అద్భుతాలేమీ జరగలేదు . టీడీపీ మీద ప్రజా వ్యతిరేకత అంతే ఉంది . వైసీపీ పట్ల సానుకూలతా చెక్కు చెదరలేదు .జరిగిందల్లా ఒక్కటే వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ కి బాబుగారిచ్చిన గిఫ్ట్ నిన్న అమరావతిలో రిటర్న్ వచ్చింది అంతే .