-శరద్ పవార్ ను వెన్నుపోటుదారుడన్న అనంత్ గీతే
మహారాష్ట్రలో పాలన సాగిస్తున్న మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు పెరుగుతున్నాయి. రెండేళ్లలోనే పాలక కూటమి విచ్చిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కూటమికి, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన మళ్లీ తన పాత మిత్రురాలు బీజేపీపై మోజు పెంచుకుంటుండటం..
ఇరు పార్టీల మధ్య మాటలు కలుస్తుండటం ఆ రెండు పార్టీలు మళ్లీ జత కడతాయన్న సంకేతాలను ఇప్పటికే ఇచ్చాయి. తాజాగా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ పై శివసేన సీనియర్ నేత అనంత్ గీతే చేసిన తీవ్ర ఆరోపణలు మహా వికాస అఘాడి మనుగడను ప్రశ్నర్థకంగా మార్చాయి. శరద్ పవార్ ను వెన్నుపోటుదారుడిగా అనంత్ గీతే అభివర్ణించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. త్వరలో జరగనున్న పెను మార్పులకు ఇది సంకేతమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వెన్నుపోటుదారుడు మా నాయకుడు కాబోడు..
తాజాగా శివసేన సీనియర్ నేత పవార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనొక వెన్నుపోటుదారుడని వ్యాఖ్యానించారు. 1999లో కాంగ్రెస్ నుంచి శరద్ పవార్ తోపాటు పి.ఏ.సంగ్మా, తారిఖ్ అన్వర్ లను తొలగిస్తే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఏర్పాటు చేశారన్నారు. మళ్లీ అదే పవార్ అధికారం కోసం 2004లో కాంగ్రెసుతో చేతులు కలిపి యూపీఏలో చేరారని విమర్శించారు.
2004, 2009 యూపీఏ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన పవార్ ఎన్నటికీ తమ గురువు కాలేరని, తమ నాయకుడు అసలే కాదని అనంత్ గీతే ఘాటుగా వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడి ఏర్పాటు రాజకీయ పరిణామాల్లో చిన్న సర్దుబాటు మాత్రమేనని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పటికే బీజేపీకి స్నేహ సంకేతాలు పంపుతున్న శివసేనపై అసంతృప్తితో ఉన్న ఎన్సీపీ నేతలు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
రెండేళ్లకే విభేదాలు
2019 ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి విజయం సాధించింది. అయితే సీఎం పదవి విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ తరుణంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ రంగప్రవేశం చేసి సేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సీఎంగా సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చక్రం తిప్పారు. దాంతో బీజేపీతో మూడు దశాబ్దాల మిత్రుత్వాన్ని సేన తెంచుకుంది.
మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోని సంకీర్ణ పక్షాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తానని, కాంగ్రెస్ సొంతంగానే పోటీ చేస్తుందని కొన్ని నెలల క్రితం సంకీర్ణ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే వ్యాఖ్యానించి కలకలం రేపారు. దీనిపై మిగిలిన రెండు పక్షాలు చిర్రు బుర్రులాడాయి. మరోవైపు రెండేళ్లుగా బీజేపీని, మోదీని ఏకిపారేస్తూ వచ్చిన శివసేన నేతలు కొద్దిరోజులుగా పొగడ్తలు ప్రారంభించారు. ఇటీవల శివసేన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని మోదీని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఒక వ్యాసం ప్రచురితమైంది.
బీజేపీ అంటేనే అంతెత్తున లేచే సేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా మోదీ అంతటి నాయకుడు ప్రస్తుతం దేశంలో లేరని ఆకాశానికి ఎత్తేశారు. అన్నింటికీ మించి నాలుగు రోజుల క్రితం ఔరంగాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఉద్ధవ్ థాక్రే అదే కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి రావు సాహెబ్ దన్వేను ఉద్దేశించి భవిష్యత్ సహచరుడు అని చేసిన వ్యాఖ్యలు బీజేపీ, సేన మళ్లీ దగ్గరవుతున్న సంకేతాలను స్పష్టంగా ఇచ్చాయి. తాజాగా అనంత్ గీతే శరద్ పవార్ ను చీల్చి చెందాడటంతో మూడు పార్టీల మిత్రత్వం మున్నాళ్ల ముచ్చట కానుందన్న వాదనలకు బలం చేకూర్చుతోంది. అదే జరిగితే త్వరలోనే మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ-సేన ప్రభుత్వం కొలువుదీరడం ఖాయం.