పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల స్థలాల కోసం అర్హులైన వారు జనవరి నెల వరకు తమ దరఖాస్తు చేసుకోవచ్చు. గురువారం గృహనిర్మాణ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.
20 లక్షలు దాటిన దరఖాస్తులు
ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా తేలిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల భూమిని గుర్తించామని, ఇక్కడ మరో 8వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించామని, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు.