iDreamPost
iDreamPost
దళితులమైన మాతో మాట్లాడతానికే ఇష్టపడని వారి పార్టీలో ఎస్సీ ఎస్టీల స్థానం ఏమిటో అర్థం అవుతోంది. మా డిమాండ్ ను పట్టించుకోకపోతే శింగనమలలో టీడీపీ ఉనికే లేకుండా చేస్తామని ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహంతో హెచ్చరించారు. అనంతపురంలో పర్యటించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా పట్టించుకుకుండా వెళ్లిపోవడంపై దళిత నేతలు మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గ ఇంఛార్జిగా బండారు శ్రావణిని తప్పించి ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీని రద్దు చేయాలని కోరేందుకు దళిత నేతలు ప్రయత్నించగా.. లోకేష్ పట్టించుకోకపోవడంతో ఆయన కారు ముందు బైఠాయించారు. అయినా పార్టీ నేతలతో వారిని పక్కకు లాగించేసి లోకేష్ వెళ్లిపోయారు.
వాహనం ముందు బైఠాయింపు
గత ఎన్నికల్లో శింగనమలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి రెండు నెలల క్రితం వరకు ఆ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. తర్వాత ఆమెను తప్పించి ద్విసభ్య కమిటీని నియమించి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ నియోజకవర్గ బాధ్యతలను వారికి కాకుండా అగ్రవర్ణ నేతలతో కూడిన కమిటీని వేయడాన్ని అక్కడి దళిత సంఘాలు, టీడీపీ దళిత నేతలు తప్పుపడుతూ అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లి అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులును నిలదీశారు. ఆ సందర్బంగా మాటామాటా పెరిగి కాల్వపై చేయి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. అప్పటి నుంచీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పాటై ఉద్యమం నిర్వహిస్తున్నాయి. ఆ మధ్య కాల్వ శ్రీనివాసులుకు వ్యతిరేకంగా పలు ఆరోపణలతో కరపత్రం కూడా హల్చల్ చేసింది.
Also Read : Kuppam.Elections Chandrababu -మునిసిపాలిటీ ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి?
ఈ నేపథ్యంలో అనంతపురం పర్యటనకు వచ్చిన లోకేష్ ను కలిసి ద్విసభ్య కమిటీ రద్దు చేయించాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు. అనంతపురంలోని ఒక కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన లోకేష్.. అక్కడే మీడియాతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా దళిత నేతలు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే లోకేష్ వారిని పట్టించుకోకుండా కారు ఎక్కేశారు. దాంతో ఆగ్రహించిన దళితులు కారు ముందు బైఠాయించారు. ఈ పరిణామంతో లోకేష్ పార్టీ నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. దాంతో వారు బైఠాయించిన దళిత నేతలను బలవంతంగా పక్కకు లాగిపడేయగా.. లోకేష్ వెళ్లిపోయారు.
టీడీపీ ఉనికి లేకుండా చేస్తాం
లోకేష్ తోపాటు టీడీపీ స్థానిక నేతలు తీరుపై దళిత జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులతో మాట్లాడటానికే లోకేష్ ఇష్టపడలేదంటే ఆ పార్టీలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న స్థానం ఏమిటో అర్థం అవుతోందని జేఏసీ అధ్యక్షుడు సాకే హరి వ్యాఖ్యానించారు. దళితులను అవమానపరుస్తూ నియమించిన ద్విసభ్య కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే శింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఉనికే లేకుండా చేస్తామని హెచ్చరించారు. కొందరు అగ్రకుల నేతలు దళితులను ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Also Read : Tdp Leaders,Real Estate Crime -హైదరాబాద్ రియల్ దందాలో ఇరుక్కున్న టీడీపీ మాజీలు?